Gandipet Land Scam 1500 Crores: నుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.    ఫేక్ జీవోల  వ్యవహారంలో గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆయన తమిళనాడులోని కాంచీపురంలో తలదాచుకున్నట్లు అందిన పక్కా సమాచారంతో సైబరాబాద్ స్పెషల్ టీమ్ అక్కడికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుంది. అనంతరం హైదరాబాద్‌కు తరలించి, వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన కీలక నేత ఇలా పక్క రాష్ట్రంలో దొరకడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Continues below advertisement

 ఫేక్ జీవోలతో రూ. 1500 కోట్ల భూదందా 

హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన గండిపేట పరిధిలో దాదాపు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బొల్లా బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్ స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు  , ల్యాండ్ డాక్యుమెంట్లను సృష్టించి ఈ ల్యాండ్ కబ్జాకు తెరలేపారు. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఈ 10 ఎకరాల భూమి విలువ దాదాపు రూ. 1,500 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తంలో నకిలీ పత్రాలతో ల్యాండ్ గ్రాబింగ్‌కు పాల్పడటం సైబరాబాద్ పరిధిలోనే అతిపెద్ద భూకుంభకోణాలలో ఒకటిగా నిలిచింది.

Continues below advertisement

 సైబరాబాద్ పోలీసుల పక్కా స్కెచ్ 

గండిపేట భూమికి సంబంధించిన నకిలీ దస్తావేజుల వ్యవహారంపై రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణలోనే బొల్లా బ్రహ్మనాయుడు ప్రధాన సూత్రధారి అని తేలడంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యారు. అయితే సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు ఆయనను కాంచీపురంలో ట్రేస్ అవుట్ చేసి అరెస్ట్ చేశారు. 

 రాజకీయంగా వైసీపీకి గట్టి దెబ్బ                      

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదువుతున్న తరుణంలో, ఇప్పుడు తెలంగాణలో కూడా కబ్జా కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ కావడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. వినుకొండ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న బ్రహ్మనాయుడు.. హైదరాబాద్‌లో ఇంతటి భారీ ల్యాండ్ స్కామ్‌కు పాల్పడ్డారనే వార్త వినుకొండ స్థానిక పాలిటిక్స్‌ను కూడా షేక్ చేస్తోంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో సైబరాబాద్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు.