వివేక హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అనుమానితుల్లో ఒకరైనా సునీల్ యాదవ్‌ను సీబీఐ ఇటీవల గోవాలో అరెస్టు చేసింది. సునీల్ అరెస్టుపై ఆయన తండ్రి స్పందించారు. వివేకానందరెడ్డితో తన కుమారుడు సన్నిహింతగా ఉండేవారని, ఒకటి రెండు సార్లు తమ ఇంటికి కూడా వచ్చారని తెలిపారు. ఆయన మంచి వ్యక్తి, అలాంటి మంచి వ్యక్తిని తన కుమారుడు హత్య చేశాడనడం సరికాదని సునీల్ తండ్రి అన్నారు. వాచ్ మెన్ రంగయ్య చేసిన ఆరోపణలు అవాస్తమని అన్నారు. 


హత్య చేసిందెవరో సీఎంకి తెలుసు!


వివేకా హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు కొందరు పెద్ద నేతలు సునీల్ ఇరికించాలని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ నేతలు, సీబీఐ అధికారుల నుంచి తమకు ప్రాణహాని ఉందన్నారు. వివేకాను హత్య చేసిందెవరో సీఎం జగన్‌కి, ప్రజలందరికీ తెలుసని చెప్పారు. సీబీఐ అధికారులు లేనిపోనివి సృష్టించి, కాలువలో మారణాయుధాలు ఉన్నాయని సునీల్‌ని నిందితుడిగా చూపేందుకు కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కేసులో అసలు నిందితులను విచారించకుండా నిరపరాధి అయిన సునీల్‌ను వేధిస్తున్నారని ఆరోపించారు. 


ఆత్మహత్య చేసుకుంటాం : సునీల్ తల్లి


వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ తల్లి సావిత్రమ్మ పులివెందులలో మాట్లాడారు. తమ కుమారుడిని 24 గంటల లోపు విడుదల చేయకపోతే తమ కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకుంటామని సావిత్రమ్మ హెచ్చరించారు. తమ కుమారుడు సునీల్ యాదవ్ కు ఏ నేరానికి పాల్పడలేదని ఆమె అన్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు సునీల్ యాదవ్ ఇంట్లోనే ఉన్నాడని, ఎక్కడికీ వెళ్లలేదని ఆమె వెల్లడించారు. 


వివేకా హత్య జరిగిన తర్వాత అందరిలాగానే తన కుమారుడు కూడా వెళ్లాడని ఆమె చెప్పారు. వివేకానంద రెడ్డి తమకు దేవుడిలాంటివాడని ఆమె చెప్పారు. అందుకే సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డితో ఉన్నాడని అన్నారు. వివేకానంద రెడ్డి 2 సార్లు తమ ఇంటికి కూడా వచ్చారని ఆమె చెప్పారు 


పరారీలో ఉన్న సునీల్‌ యాదవ్‌ను గత సోమవారం సీబీఐ గోవాలో అదుపులోకి తీసుకుని, ఏపీకి తీసుకువచ్చింది. ట్రాన్సిట్‌ వారెంట్‌ పై తీసుకువచ్చిన సునీల్ ను స్థానిక సీబీఐ కోర్టులో హాజరు పరిచారు. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత సునీల్‌ యాదవ్‌ తీరు అనుమానాస్పదంగా ఉన్నట్లు సీబీఐ తెలిపింది. ఈ ఏడాది మార్చిలో సునీల్ ను ఢిల్లీలో విచారించింది. ఆ తర్వాత సునీల్‌ యాదవ్‌ పరారీ ఉన్నాడు. అతని కోసం గాలింపు చేపట్టిన సీబీఐ అధికారులు గత సోమవారం గోవాలో అదుపులోకి తీసుకున్నారు.


మారణాయుధాల కోసం వెతుకులాట


మాజీ మంత్రి వివేకా హత్యకు ఉపయోగించిన మారణాయుధాల కోసం సీబీఐ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. వరుసగా మూడో రోజూ పులివెందులలోని రోటరీపురం వీధి సమీపంలోని కాలువలో గాలింపు కొనసాగిస్తున్నారు. గరండాలవంకలోనూ ఆయుధాల కోసం వెతికారు. వివేకా కుమార్తె సునీత సోమవారం ఉదయం సీబీఐ అధికారులను కలిసి, ఆ తర్వాత రోటరీపురంలో ఆయుధాల వెలికితీతను పరిశీలించారు. సీబీఐ అధికారులు సోమవారం సాయంత్రం సునీల్‌ను వివేకా ఇంటి పరిసరాల్లో తిప్పి కొన్ని కీలక వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో 13 మందిని సీబీఐ అధికారుల బృందం విచారించింది. వీరిలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు, యూసీఐఎల్‌ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆయన తండ్రి ప్రకాష్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ ఛైర్మన్‌ వరప్రసాద్‌ ఉన్నట్లు సమాచారం. సీఎం జగన్‌ మామ గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బంది రామకృష్ణారెడ్డి, ఓబులేషు, స్థానిక వైకాపా నాయకుడు జగదీశ్వర్‌రెడ్డి, స్థానిక సీఎస్‌ఐ చర్చి సభ్యులు, స్థానిక వైద్య సిబ్బందిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. 


Also Read: ys viveknanda reddy murder case : వాచ్‌మెన్‌ రంగయ్య ఏం చెప్పాడు? వైఎస్ వివేక హత్య కేసులో సస్పెన్స్‌