నూజివీడు పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీలో గంజాయి వ్యవహరం కలకలం రేపుతోంది. చీకటి పడిందంటే చాలు, గంజాయి సేవించిన యువకులు అరుపులు కేకలతో ఎంఆర్ అప్పారావు కాలనీలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాత్రి 7 దాటాక కాలనీలో తిరగాలంటే భయాందోళనలకు గురవుతున్నామని కాలనీవాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో గంజాయి సేవించి ఆగడాలను పాల్పడుతున్న యువకుల సంఖ్య పెరుగుతుందని స్థానికులు అంటున్నారు.


ప్రశాంతతకు నూజివీడు కేరాఫ్ అడ్రస్...


నూజివీడు పేరు చెప్పగానే దేశంలో ఎక్కడ తెలుగు వారు ఉన్నా ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి. మామిడికి నూజివీడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఇక్కడ నుంచి మామిడి రసాలు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ప్రశాంతంగా ఉండే నూజివీడులో ఇప్పుడు గంజాయి వ్యవహరం చర్చనీయాశంగా మారుతుంది. స్థానికంగా ఉన్న యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. గంజాయి, వైట్‌నర్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. 


ఇటీవల కాలంలో నూజివీడు ఎమ్మార్ అప్పారావు కాలనీలో గంజాయి సేవించి ఆగడాలకు పాల్పడుతున్న యువత సంఖ్య పెరుగుతుందని స్థానికులు అంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా, గంజాయి మత్తులో ఉన్నకొందరు యువకులు దాడులకు పాల్పడుతున్నారని అంటున్నారు. గతంలో ఈ వ్యవహరంపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై పోలీసులు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించి వాహనాలపై వెళ్ళే యువకులను ఆపి తనఖీ చేయటంతో కొంత మేర యువకుల ఆగడాలు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ కొందరు యువకులు గంజాయిని సేవించి అల్లర్లకు కారణమవుతున్నారని అంటున్నారు. కాలనీపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు రిక్వస్ట్ చేస్తున్నారు. 


నూజివీడులో ఎందుకిలా...
నూజివీడు వంటి ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు వెలుగులోకి రావటం వెనుక కారణాలపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు ప్రాంతం గతంలో ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో ఉండేది. దీంతో కృష్ణాజిల్లా పోలీసులు ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. అయితే ఇప్పడు జిల్లాల విభజన తరువాత పోలీసులు పరిధి కూడా మారింది. ఏలూరు జిల్లా పరిధిలోకి నూజివీడు ప్రాంతం వచ్చింది. పోలీసులు పరిధులు మారటంతో నిఘా వర్గాలకు సైతం తెలియకుండానే, యువత గంజాయి వంటి మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు, నూజివీడు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లాలకు సరిహద్దు ఉండటంతో పోలీసుల నిఘా కూడా కొరవడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీంతో గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా కూడా జోరుగా సాగటంతో యువత చాలా సునాయాసంగా వాటిని కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు.


పోలీసులు ఏమంటున్నారంటే....
ఈ వ్యవహరంపై స్థానిక పోలీసులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడటంతో యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని నూజివీడు ఎస్సై మూర్తి అంటున్నారు. ప్రజలు కూడా సహకరించాలని ఎవరైనా గంజాయి సేవించినా, అమ్మినా సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇప్పటికే గంజాయి సేవించిన యువకులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించామని ప్రజలు కూడా సహకరించి ముందుకు వస్తే గంజాయిని సమూలంగా నిర్మూలించే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు కూడా సహకరిస్తేనే యువత పెడదోవ పట్టకుండా పోలీసులు తీసుకునే చర్యలు ఫలితాలు ఇస్తాయని అంటున్నారు.