Tree Broken On Young Woman In Tirumala: తిరుమలలో (Tirumala) శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. జాపాలి తీర్థంలో ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్న ఓ యువతిపై చెట్టుకొమ్మ విరిగిపడింది. ఈ ఘటనలో ఆమె తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు బర్డ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో తోటి భక్తులు ఆందోళన చెందారు. ఈ ప్రమాదాన్ని మరో భక్తులు సెల్ ఫోన్‌లో చిత్రీకరించగా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


తిరుపతిలో రోడ్డు ప్రమాదం


అటు, తిరుపతిలో (Tirupathi) గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని బీఎన్ కండ్రిగ మండలం పార్లపల్లి వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒడిశాకు చెందిన బపూన్‌ఖాన్ (22), సుఖ్‌దేవ్‌సింగ్ (21), రాజాసింగ్ (23) మృతి చెందారు. వీరు స్థానికంగా ఉన్న అట్టల పరిశ్రమలో పని చేస్తున్నారు. గురువారం బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


భక్తులపై ఫ్రాంక్ వీడియో - టీటీడీ సీరియస్


అటు, తిరుమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఓ ట్యూబర్ చేసిన ఫ్రాంక్ వీడియోలపై టీడీపీ సీరియస్ అయ్యింది. ఇద్దరిపై చర్యలకు ఉపక్రమించింది. కొద్ది రోజుల కిందట తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్, అతని మిత్రులు తిరుమల వచ్చారు. వాసన్ మిత్రుడు ఒకరు నారాయణగిరి షెడ్లలోని క్యూ లైన్‌లో వెళ్తూ.. కంపార్ట్‌మెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా నటించాడు. కంపార్ట్‌మెంట్ గేట్ తాళాలు తీస్తున్నారని నమ్మిన భక్తులు ఒక్కసారిగా లేచి అటు వెళ్లబోయారు. వెను వెంటనే వారిద్దరూ వెకిలిగా నవ్వుతూ పరుగులు తీశారు. ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో తమిళనాడులో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు, దీనిపై విమర్శలు రావడంతో టీటీడీ స్పందించింది. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వాసన్ సహా ఈ వీడియో తీసిన వ్యక్తిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని తమిళనాడు పంపినట్లు తెలుస్తోంది.


భక్తుల రద్దీ


మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. దాదాపు 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. గురువారం 65,392 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 29,015 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.23 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.


Also Read: Tirumala : తిరుమల క్యూలైన్లలో తమిళ ఆకతాయిల ప్రాంక్ వీడియోలు - వార్నింగ్ ఇచ్చిన టీటీడీ