Young Man Threatened Young Woman With AIDS Injection In Hyderabad: తనను ప్రేమించకుంటే ఎయిడ్స్ ఇంజక్షన్ ఇస్తానని ఓ యువతిని యువకుడు వేధించిన ఘటన హైదరాబాద్‌లోని (Hyderabad) హయత్‌నగర్‌లో జరిగింది. అంతేకాకుండా యువతి అమ్మనాన్నలను చంపేస్తానని బెదిరించాడు. తనను వేధింపులకు గురి చేసినట్లు బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి తెలిపిన వివరాల ప్రకారం.. చెరుకుపల్లి విజయ్ అనే యువకుడు.. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినికి ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు. ఫ్రెండ్‌గా ఉంటూ తర్వాత తనను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఇద్దరూ కలిసి సరదాగా ఉన్న సమయంలో దిగిన ఫోటోస్, వీడియోలు అందరికీ చూపిస్తానంటూ బెదిరిస్తున్నాడని వాపోయింది.


తాను కాలేజీ నుంచి వస్తోన్న సమయంలో వెంటపడి.. బలవంతంగా బైక్ మీద ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని ఆరోపించింది. చాలాసార్లు కాలేజీలో వెంటపడి కొట్టాడని, బంధువులందరికీ ఫోన్ చేస్తూ మీ బిడ్డని చంపుతానని బెదిరిస్తున్నాడని వాపోయింది. యువకుడి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తన ఇంటికే వచ్చి అడ్డుపడ్డ తన తండ్రి మీద దాడికి దిగాడని అంతేకాకుండా తనకు తెలిసిన కొంతమంది అమ్మాయిలను ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపింది. గతంలో కూడా నాగార్జునసాగర్లో కంప్లైంట్ ఇవ్వగా అక్కడ కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. విజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Crime News: పెన్ను కోసం గొడవ - భవనం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య