Student Forceful Death In Palnadu District: పెన్ను కోసం ఏర్పడిన స్వల్ప వివాదంతో ఓ విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పల్నాడు జిల్లా (Palnadu District) నరసరావుపేటలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. శనివారం ఉదయం హాస్టల్‌లో ఉన్న సమయంలో తన స్నేహితురాలితో ఓ పెన్ను విషయంలో స్వల్ప వివాదం జరిగింది.
ఈ క్రమంలో మనస్తాపానికి గురైన అనూష హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కళాశాల యాజమాన్యం ద్వారా విషయం తెలుసుకున్న నరసరావుపేట ఆర్డీవో హేమలత, తహసీల్దార్ వేణుగోపాల్, గ్రామీణ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో విషాదం
అటు, నదిలో స్నానానికని వెళ్లిన దంపతులు నీట మునిగి మృతి చెందిన తీవ్ర విషాద ఘటన ఇదే పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. రెంటచింతల మండలం తుమృకోటకు చెందిన దంపతులు నీలా సత్యనారాయణ, పద్మావతి దంపతులు శనివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నదిలో స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. అక్కడే ఉన్న గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా.. కొద్దిదూరంలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.