Man Forceful Death After Killing Boy Who Cuaght him While Stealing: తాను దొంగతనం చేస్తుండగా పట్టించాడని బాలుడిని పగతో హతమార్చిన వ్యక్తి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందు తానే బాలుడిని చంపినట్లు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ (Andole) మండలం జోగిపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం పరిధిలోని జోగిపేటకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఓ దుకాణంలో కేబుల్ వైర్లు దొంగతనం చేస్తుండగా శేఖర్ (13) అనే బాలుడు చూసి స్థానికులకు పట్టించాడు. ఈ క్రమంలో బాలుడిపై పగ పెంచుకున్న నాగరాజు శనివారం రాత్రి మాట్లాడాలని బాలుడినీ తీసుకెళ్లి హత్య చేసి బావిలో పడేశాడు. అనంతరం ఆదివారం ఉదయం పోలీసులకు ఫోన్ చేసి తానే బాలుడిని చంపినట్లు చెప్పాడు. డబ్బులు అడిగితే ఇవ్వలేదని శనివారం రాత్రి ఓ వ్యాపారిపైనా కత్తితో దాడికి పాల్పడ్డాడు.
నిందితుడి ఆత్మహత్య
నాగరాజును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆదివారం ఉదయం గ్రామానికి వెళ్లగా భయపడి సెల్ టవర్ ఎక్కాడు. ఈ క్రమంలోనే ఇద్దరిపై కత్తితో దాడి కూడా చేశాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో బాలుడు శేఖర్ (13) మృతదేహాన్ని బావిలో నుంచి పోలీసులు బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సెల్ టవర్ ఎక్కిన నాగరాజు ఉదయం నుంచీ అక్కడే ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా ఉండడంతో డ్రోన్ కెమెరాతో అతని కదలికలను గుర్తించారు. ఈ క్రమంలో నిందితుడు కేబుల్ వైర్లతో ఉరేసుకుని వేలాడుతున్న దృశ్యం కనిపించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. కాగా, నాగరాజుపై గతంలో చాలా కేసులు ఉన్నాయి. వ్యాపారులు, దుకాణదారులపై దాడులకు పాల్పడుతూ డబ్బులు తీసుకునేవాడని స్థానికులు చెబుతున్నారు.
Also Read: Hyderabad News: షాకింగ్ ఘటన - రిమాండ్ ఖైదీ కడుపులో మేకులు, శ్రమించి బయటకు తీసిన వైద్యులు