Boiler Exploded In A Cement Factory: ఎన్టీఆర్ జిల్లా (NTR District) జగ్గయ్యపేటలోని (Jaggayyapeta) బోదవాడలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలి 20 మంది కార్మికులకు గాయాలయ్యాయి. తోటి కార్మికులు, సిబ్బంది క్షతగాత్రులను జగ్గయ్యపేట, విజయవాడ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిని బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. అయితే, క్షతగాత్రులను యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు ఆగ్రహంతో కంపెనీ కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేయగా.. ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.
స్పందించిన మంత్రి
ఈ ఘటనపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడుకు ప్రీ హీటర్ లోపమే కారణమని ప్రాథమికంగా తెలిసిందన్నారు. దీన్ని జాగ్రత్తగా నిర్వహించడంలో సంస్థ విఫలమైందన్నారు. ఎక్కువ వేడి ఉత్పన్నమై పేలుడు సంభవించిందని.. క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.