Woman Suicide Attempt: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో ఓ వివాహిత తన పిల్లలను వెంటబెట్టుకొని వచ్చి నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది. తనకు, తన పిల్లలకు చెందాల్సిన ఆస్తిని.. తన భర్త, అత్త, ఆడపడుచు, బావ కావాలనే తనను హక్కుదారుగా తప్పించి, తనకు తెలియకుండా వేరే వాళ్లకు అమ్మేశారని కన్నీరుమున్నీరు అయింది. ఉన్న ఆస్తిని అమ్మేసి తనకు, తన పిల్లలకు అన్యాయం చేశారంటూ ఆరోపించింది. టెక్కలిలోని కచేరి వీధికి చెందిన ఉల్లాస సంగీత.. తన పిల్లలు మృదుల, తేజలతో కలిసి పురుగుల మందు చేత పట్టుకొని నడిరోడ్డుపైకి వచ్చింది. తమకు న్యాయం చేయకపోతే.. ఇక్కడే ప్రాణాలు తీస్కుంటామంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
టెక్కలిలోని కచేరి వీధికి చెందిన ఉల్లాస సూర్య కుమార్, సంగీత దంపతులకు 2011లో వివాహం జరిగింది. వీరికి పదేళ్ళ కుమార్తె, ఎనిమిదేళ్ళ కుమారుడు ఉన్నారు. వివాహం జరిగిన తరువాత కొన్నేళ్ల పాటు వీరు హైదరాబాద్ లోనే పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. కొంత కాలం కిందటే టెక్కలికి వచ్చారు. ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే తన భర్త సూర్య కుమార్ పై కోర్టులో మనోవర్తి కేసుతో పాటు ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఇల్లు, స్థలంపై తనకు తన పిల్లలకు హక్కు కల్పించాలని కోర్టును ఆశ్రయించింది.
తనకు తెలియకుండానే ఇంటి అమ్మకం..
అయితే సదరు స్థలం అంశం కోర్టు పరిధిలో ఉండగా తన భర్త సూర్య కుమార్ తో పాటు ఉర్లాపు చిన్నమ్మడు, ఆడ పడుచు పి. లక్ష్మీ, బావ రమేష్ కలిసి రెవెన్యూ అధికారుల ద్వారా.. తన పేర్లను హక్కుదారుగా తప్పించారని సంగీత వాపోయింది. 2021 అక్టోబర్ 29న రెవెన్యూ అధికారుల ద్వారా లీగల్ హైర్ చేయించి ఇంటి స్థలాన్ని పట్టణానికి చెందిన మోణింగి శ్రీనివాస రావు అనే వ్యక్తికి తనకు తెలియకుండానే అమ్మకం చేపట్టినట్లు వివరించింది. భర్త, అత్త, బావ, ఆడపడుచులు కావాలనే తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ... కన్నీరుమున్నీరుగా విలపించింది. కోర్టులో ఉన్న స్థలానికి రెవెన్యూ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారనీ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా చేశారని బాధితురాలు మీడియా ఎదుట సంగీత ఆవేదన వ్యక్తం చేసింది.
పోలీసులు కూడా పట్టించుకోలేదు..
అంతే కాకుండా తనకు న్యాయం చేయాలని టెక్కలి పోలీసులకు పిర్యాదు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయింది. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి జేసీబీతో దాన్ని పడగొట్టి చదును చేశారని వివరించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక డీసీసీబీ బ్యాంకు ఎదురుగా ఉన్న స్థలం వద్ద భైఠాయించి అధికారులు, పోలీసుల తీరుపై ఆమె అసహనాన్ని వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ గోపాలరావు సిబ్బందితో స్థలానికి చేరుకోగా పోలీసులను తప్పు పడుతూ భాదితురాలు మరోసారి తన బాధను వెల్లగక్కింది.
జిల్లా ఎస్పీని కూడా కలుస్తా...
ఆత్మహత్యాయత్నం చేస్తున్న బాధితరాలికి సద్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆమె వినలేదని వివిరంచారు. ఏడాదిన్నర కాలంగా పోలీసుల చుట్టూ తిరిగుతుంటే పట్టించుకోలేదని.. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలంటూ సంగీత మరోసారి ధర్నా చేసింది. త్వరలోనే జిల్లా ఎస్పీని కలిసి పరిస్థితి వివరిస్తానని , అలాగే మానవ హక్కుల కమిషన్ లో కూడా ఫిర్యాదు చేయనున్నట్టు సంగీత చెప్పారు. తనకు అన్యాయం చేసిన రెవెన్యూ పోలీస్ సబ్ రిజిస్టర్ కార్యాలయ వర్గాల పై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.