Dowry harassment in Karnataka: అమ్మాయి నచ్చింది అని చెప్పి పెళ్లికి ఒప్పుకున్నాడు. కట్నం వద్దంటే అమ్మాయి కుటుంబం పొంగిపోయింది. మంచి కుటుంబంలోకి అమ్మాయి వెళ్తోందని మురిసిపోయింది. ఘనంగా పెళ్లి జరిపించారు పెద్దవాళ్లు. పెళ్లి పీటలు ఎక్కి తాళి కట్టాడు వరుడు. మూడు ముళ్లు వేసి జీవన భాగస్వామి అయ్యాడు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత... అసలు రంగు బయటపెట్టాడు. మూడు ముళ్లు వేసి మొగుడిగా మారాడు గానీ... శోభనం గదిలో మాత్రం అడుగుపెట్టనని మొండికేశాడు. భార్యతో దాంపత్య జీవితం మొదలుపెట్టాలంటే... 15లక్షల రూపాయల కట్నం కావాలని పేచీ పెట్టాడు. రూ.15లక్షలు ఇస్తేనే కొడుకుతో కాపురం చేయనిస్తామని వరుడి తల్లిదండ్రులు కూడా తెగేసి చెప్పేశారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు షాకయ్యారు. వారు అడిగిన డబ్బులు ఇచ్చుకోలేక... కొన్ని నెలలుగా వారి వేధింపులు భరిచంలేక.. కర్ణాటకలోని బసవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో విషయం వెలుగుచూసింది. 


అసలు ఏం జరిగిందంటే... 
బాధితురాలి వివరాల ప్రకారం.... కర్ణాటకలోని బసవనగుడికి చెందిన బాధిత మహిళకు 2022 జూన్‌ 6న అవినాశ్‌ శర్మతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వరుడు కుటుంబ సభ్యులు కట్నం వద్దన్నారు. దీంతో సంతోషంగా పెళ్లి జరిగిపోయింది. కూతురికి అప్పగింతు పెట్టి భర్త ఇంటికి పంపారు ఆమె తల్లిదండ్రులు. ఆమె భర్త ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుంచే వరకట్న వేధింపులు మొదలయ్యాయి. మీ కుటుంబ సభ్యులు రూ.15లక్షలు ఇస్తామని చెప్పారని... ఆ డబ్బు ఇవ్వకపోతే మొదటిరాత్రి శోభనానికి అనుమతించేదిలేదని వరుడి తండ్రి కోడలిని బెదిరించాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది బాధితురాలు. దీంతో డబ్బు ఇవ్వడానికి తల్లిదండ్రులు కొద్దిరోజులు సమయం ఇవ్వాలని కోరారు.


కోడల్ని బెదిరించిన వరుడి తల్లిదండ్రులు 
2022 జూన్‌ 22న బాధితురాలి తల్లిదండ్రులు వరుడి తల్లిదండ్రులకు 5 లక్షల 80వేల రూపాయల నగదు ఇచ్చారు. అయితే అది సరిపోదని.. మిగిలిన 10లక్షల రూపాయలు తేవాలని... లేదంటే ఇంట్లో ఉండనిచ్చేదిలేదని కోడల్ని బెదిరించారు వరుడి తల్లిదండ్రులు. అంతేకాదు.. తండ్రి స్థానంలో ఉండాల్సిన మామ.. తాను స్నాం చేస్తుండగా చాటుగా గమనించేవాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మామను ప్రశ్నించగా ఎవరికైనా చెబితే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తామని బెదిరించాడని వాపోయింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలన్ని పేర్కొంది బాధితురాలు. వారి వేధింపులు భరించలేక బాధిత మహిళ పుట్టింటికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంది. 


భర్తతో కాపురం చేయనివ్వకుండా... మిగిలిన 10లక్షల రూపాయలు ఇస్తేనే మొదటి రాత్రి అంటూ అటు భర్త, అతని తల్లిదండ్రులు వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. తల్లిదండ్రులు అల్లుడి ఇంటి దగ్గరకు ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. మిగిలిన రూ.10 లక్షల డబ్బు ఇవ్వాలని, ఆ నగదు ఇస్తేనే మొదటి రాత్రి  అని, ఇవ్వకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్తోంది బాధితురాలు. వారి బాధలు భరించలేక పుట్టింట్లోనే ఉంటున్నానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.


తనకు సంబంధించిన పత్రాలు అత్తగారింట్లో ఉన్నాయని వీటి గురించి అడిగినా... డబ్బులు ఇచ్చి పత్రాలు తీసుకెళ్లాలని అంటున్నారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బసవనగుడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. బాధితురాలి అత్తింటి సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.