Crime News: భర్తలపై భార్యల అఘాయిత్యాలు ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొన్న ఇండోర్‌లో హనీమూన్‌కు తీసుకెళ్లిన భర్తను భార్య హతమార్చింది. నిన్న గద్వాల్‌లో ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించిందో మహిళ. ఇవన్నీ కూడా పెళ్లైన కొత్తలోనే జరిగాయి. ఇప్పుడు ఇంకా షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. మొదటి రాత్రి గదిలోకి కత్తితో వచ్చి వరుడిని బెదిరించింది. తనకు లవ్ ఎఫైర్ ఉందని చెప్పింది. తన దారికి అడ్డు రావద్దని హెచ్చరించింది. 

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన నిషాద్‌ అనే వ్యక్తితో సితార అనే యువతికి వివాహం అయ్యింది. చాలా సంతోషంగా పెళ్లి వేడుకలు జరిగాయి. చివరకు అమ్మాయిని అత్తారింటికి తీసుకొచ్చారు. మొదటి రాత్రికి ఏర్పాట్లు చేశారు. అంతా బాగుందని అనుకున్న టైంలో కథ అడ్డం తిరిగింది. ఫస్ట్‌ నైట్ రూంలోకి కత్తితో వచ్చిన వధువు వరుడికి షాక్ ఇచ్చింది. కత్తితో వరుడికి వార్నింగ్ ఇచ్చింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తనకు వేరే ప్రియుడు ఇష్టం లేదని చెప్పేసింది. కాదూ కూడదని తనపై చేయి వేస్తే నీ బాడీని ముక్కలు ముక్కలు చేస్తానంటూ బెదిరించింది. అంతే వరుడు బెదిరిపోయాడు. రాత్రంతా నిద్రలేకుండా గడిపాడు. 

తనకు ప్రియుడు ఉన్న విషయం ఎవరికీ చెప్పొద్దని సితార బెదిరించింది. చెప్పినట్టు అయితే తప్పుడు కేసులు పెట్టి స్టేషన్‌ చుట్టూ తిప్పిస్తానని చెప్పింది. అయినా ధైర్యం చేసుకొని వరుడు మొదటి రాత్రి జరిగిన విషయాలు తల్లిదండ్రులకు చెప్పాడు. తనతో కాపురం చేయడం తన వల్ల కాదని చెప్పేశాడు. 

సితార అసలు రూపం తెలుసుకున్న వరుడి కుటుంబ సభ్యులు పెద్దల ముందు పంచాయితీ పెట్టారు. విషయం తెలిసిన సితార తల్లిదండ్రులు కూడ షాక్ అయ్యారు. తన కుమార్తెతో మాట్లాడు. ఏదో తెలియని తనంతో చేసిందని నచ్చజెప్పారు. పెళ్లైన మొదట్లోనే ఇలాంటివి సహజమని అంతా సర్ధిచెప్పారు.   

పెద్దలంతా రిక్వస్ట్ చేయడంతో వరుడు నిషాద్‌ వెనక్కి తగ్గాడు. సితారతో కలిసి జీవించేందుకు ఓకే చెప్పాడు. ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. అందరి ముందు అన్నింటికీ ఓకే చెప్పిన సితార ఇంటికి వచ్చిన తర్వాత మారిపోయింది. తన నిజస్వరూపం మళ్లీ చూపించింది. వరుడితోపాటు కుటుంబాన్ని వేధించడం స్టార్ట్ చేసింది. 

సితార దెబ్బకు నిషాద్ ఫ్యామిలీ షేక్ అయిపోయింది. ఏం చేయాలో ఆర్థం కాక పోలీసులను ఆశ్రయించింది. తమ కోడలు వేధిస్తోందని కేసు పెట్టారు. కానీ ఇంతలో సితార తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. తీరా ఆ ప్రియుడు ఎవరా అని ఆరా తీస్తే ఆమెకు మేనల్లుడు వరస అవుతాడని తేలింది. ఇప్పుడు వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.