Wife Murdered Her Husband In Chittor District: ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లాలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి యువతిపై కత్తితో దాడి చేయగా.. చిత్తూరు జిల్లాలో (Chittor District) ఓ మహిళ తన భర్త కళ్లల్లో కారం కొట్టి రాయితో మోది దారుణంగా చంపేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అడ్డు తొలగించుకునేందుకు పక్కా ప్లాన్‌తో ప్రియుడితో కలిసి అంతమొందించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన గోవింద్, మీనాలకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వీరు గొర్రెల కాపరులుగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రాళ్లబూదుగురుకు చెందిన ఆనంద్‌తో మీనాకు పరిచయం ఏర్పడింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
భర్త అడ్డుగా ఉన్నాడని..
దీంతో తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన మీనా ప్రియుడి ఆనంద్‌తో కలిసి అతన్ని చంపాలని పక్కా ప్లాన్ వేసింది. గొర్రెలను తీసుకుని అటవీ ప్రాంతంలో మేపుతుండగా భర్త కళ్లల్లో కారం కొట్టిన మీనా అతనిపై రాయితో దాడి చేసి కిరాతకంగా ప్రియుడి సహకారంతో అంతమొందించింది. మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి పక్కనే ఉన్న కర్ణాటక బార్డర్‌లో పడేశారు. అనంతరం ఏమీ ఎరగనట్లు తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ నెల 4న ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశారు. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా ప్రియుడితో కలిసి భర్తను చంపేసినట్లు అంగీకరించింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమోన్మాది ఘాతుకం
అటు, కడప జిల్లాలో (Kadapa District) ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదని ఓ యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. వేముల మండలం కొత్తపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై కుల్లాయప్ప అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయగా చుట్టుపక్కల వారు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని స్థానికులు వెంటనే పులివెందులలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. యువతి శరీరంపై 13 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. యువతి తండ్రి వీఆర్ఏగా పని చేస్తూ రెవెన్యూ గ్రామసభల కోసం గొందిపల్లెకు వెళ్లారు. తల్లి కూలిపనికి వెళ్లడంతో ఇంట్లో యువతి ఒక్కతే ఉండడం చూసి నిందితుడు దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.
Also Read: CM Chandrababu: త్వరలో 1.22 లక్షల ఉద్యోగాలు - ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన