Wife bites husband Tongue: కర్నూలు జిల్లాలో విచిత్ర ఘటన జరిగింది. ప్రేమగా దగ్గరికి తీసుకున్న ఓ వ్యక్తికి భార్య చేతిలో చేదు అనుభవం ఎదురైంది. భర్త బలవంతంగా ముద్దు పెడుతున్నాడని  భార్య అతని నాలుక కొరికేసింది. తుగ్గలి మండలం యల్లమ్మగుట్ట తండాలో ఈ ఘటన జరిగింది.


ప్రేమ పెళ్లి చేసుకున్నారు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన తారాచంద్ నాయక్, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎల్లమ్మగుట్ట తండాకు చెందిన పుష్పవతిని 2015లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. తారా చంద్ నాయక్ ఓ షాపులో పని చేస్తున్నాడు. అక్కడ వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2021 వరకు వీరి సంసారం అన్యోన్యంగా సాగింది. ఆ తరువాతే వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. రెండేళ్ల నుంచి భార్య,భర్తలు ప్రతి చిన్న విషయానికి ఘర్షణ పడుతున్నారని స్థానికులు చెప్పారు. రోజు అరుచుకోవడం, తిట్టుకోవడం జరుగుతోందని చుట్టుపక్కల వారు తెలిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కూడా వారిద్దరూ గొడవ పడ్డారు. 


ఇష్టం లేకండా ముద్దు పెడుతున్నాడని
గొడవ తర్వాత భార్యను తారాచంద్ నాయక్ భార్య పుష్పవతిని దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో కోపం తెచ్చుకున్న పుష్పవతి తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెడుతున్నాడని భర్త నాలుకను బలంగా కొరికింది. దీంతో చంద్రానాయక్‌ నాలుక పైభాగంలో తీవ్ర గాయమైంది. బాధతో విలవిలలాడుతున్న అతన్ని కుటుంబ సభ్యులు గుత్తిలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు తారాచంద్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. మరింత మెరుగైన చికిత్స అవసరమని గుర్తించి అనంతపురం హాస్పిటల్‌కు రెఫర్ చేశారు.


పరస్పర ఆరోపణలు..
ఘటనపై భార్యభర్తలు పరస్పర ఆరోపణలకు దిగారు. పుష్పవతి తనపై కోపంతోనే నాలుక కొరికిందని భర్త తారా చంద్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెకు గ్రామంలోని మరొకరితో సన్నిహిత సంబంధం ఉందని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని బాధితుడు ఆరోపించాడు. భర్త చంద్రానాయక్ తనపై తరచూ దాడి చేస్తున్నాడని, ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టేందుకు వచ్చాడని పుష్పవతి ఆరోపించంది. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగానే ఇలా చేసినట్లు ఆమె తెలిపారు. దీనిపై భార్యాభర్తలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. భర్త నాలుక కొరికిన భార్య వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial