Kolkata Doctor Death Case: కోల్‌కతా హత్యాచార ఘటన చుట్టూ ఎన్నో సందేహాలు అల్లుకున్నాయి. అసలు మొట్ట మొదట FIR నమోదు చేసి తీరే అనుమానాలకు తావిస్తోంది. బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్న వివరాల ప్రకారం రాత్రి 11 గంటలకు వాళ్లకి హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇంటి నుంచి హాస్పిటల్‌కి చేరుకునే సరికి అర్ధరాత్రి 12 అయింది. ఆత్మహత్య చేసుకుందని చెప్పి అక్కడే కూర్చోబెట్టారు. దాదాపు మూడు గంటల తరవాత డెడ్‌బాడీని చూసేందుకు అనుమతినిచ్చారు. బాధితురాలి తండ్రి లోపలికి వెళ్లి తన కూతురి మృతదేహాన్ని చూశారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆయన డెడ్‌బాడీని గుర్తించారు. ఆ తరవాత వెంటనే పోలీసులు FIR నమోదు చేయాల్సింది. కానీ ఆ ఊసే లేదు. 


అధికారిక సమాచారం ప్రకారం 11.45 గంటలకు FIR నమోదు చేశారు. అంటే తల్లిదండ్రులు వచ్చి డెడ్‌బాడీని గుర్తించాక దాదాపు 8 గంటలు దాటిపోయాక అప్పుడు FIR నమోదైంది. ఇన్ని గంటలు ఎందుకు ఆలస్యం చేశారన్నదే కీలకంగా మారింది. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయమై పోలీసులను తీవ్రంగా మందలిచింది. తండ్రి ఫిర్యాదు చేస్తే తప్ప FIR నమోదు చేయకపోవడమూ అనుమానాలకు దారి తీస్తోంది. అన్ని గంటల పాటు ఏం చేశారని సుప్రీంకోర్టు పోలీసులను ప్రశ్నించింది. అంత్యక్రియలు చేయాల్సిన మృత దేహాలు మూడు ఉన్నాయని, కానీ తొందర పెట్టి తన కూతురికే ముందుగా అంత్యక్రియలు చేశారని తండ్రి చెబుతున్నారు. 


వేరే విధుల్లో బిజీగా ఉండి...


FIR నమోదులో ఆలస్యంపై కోల్‌కతా పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. పోలీస్ అధికారులు ఇచ్చిన ఇంటర్వ్యూల ఆధారంగా చూస్తే హాస్పిటల్‌లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ సెమినార్‌ రూమ్‌లో డెడ్‌బాడీ ఉందని 9.45 గంటలకు సమాచారం అందించారు. అయితే... హాస్పిటల్ సిబ్బంది నుంచి అధికారికంగా మధ్యాహ్నం రాతపూర్వక ఫిర్యాదు అందింది. 10 గంటలకు సమాచారం ఇస్తే 10.30 గంటలకు హాస్పిటల్‌కి వెళ్లామని పోలీసులు చెబుతున్నారు. ఆ తరవాతే అసహజ మరణం కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు. ఇది కచ్చితంగా హత్యే అని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని, ముందే ఫిర్యాదు చేసినా FIR నమోదు చేయలేదని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. తాము కంప్లెయింట్ చేశాక గంటకి కేసు నమోదు చేశారని, అసలు ఇంత ఆలస్యం ఎందుకు చేశారో పోలీసులకే తెలియాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


ఇలాంటి సందర్భాల్లో ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత హాస్పిటల్ యాజమాన్యానికే ఉంటుందని, తల్లిదండ్రులు వచ్చి కంప్లెయింట్ ఇచ్చే వరకూ ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి కేసులలో పోలీసులు సుమోటోగా FIR నమోదు చేసే అవకాశముందని క్రిమినల్ లాయర్స్ చెబుతున్నారు. అయినా ఈ కేసులో అది హత్య అని చెప్పడానికి అన్ని ఆధారాలూ ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం చేశారో అర్థం కావడం లేదని అంటున్నారు. అయితే.. FIR నమోదు చేయాల్సిన సిబ్బంది బిజీగా ఉండడం వల్ల ఆలస్యం జరిగిందన్న వాదన వినిపిస్తున్నారు పోలీసులు. 


Also Read: Kolkata: కోల్‌కతా కేసులో మరో సంచలనం, అనాథ శవాలు అమ్ముకున్న మాజీ ప్రిన్సిపల్ - బంగ్లాదేశ్‌తోనూ లింక్‌లు