తిరుమల నడక మార్గంలో జరుగుతున్న వరుస ఘటనలకు పూర్తి బాధ్యత టీటీడీ, అధికారులదే అంటున్నాయి ప్రతిపక్షాలు. వారి నిర్లక్ష్యంగా కారణంగానే చిన్నారి బలై పోయిందని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఎవరు సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నాయి. 


చిన్నారి లక్షిత మృతికి అధికారుల వైఫల్యమే ప్రధాన కారణమన్నారు బీజేపీ నేత భానుప్రకాష్. నడక దారిలో కౌశిక్‌పై జూన్‌లో చిరుత దాడి చేసిన తరువాత కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. నడకదారులోని నిర్మానుష్య ప్రాంతంలో ప్రత్యేక చర్యలు ఏం తీసుకున్నారు టిటిడి వివరించాలని డిమాండ్ చేశారు. 


ఇలాంటి వాటిపై పూర్తి వివరాలు తీసుకొని కేంద్రానికి ఫిర్యాుద చేస్తామన్నారు భానుప్రకాష్‌. టిటిడి అటవీ శాఖా అధికారుల దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 


ఉదయం నుంచి చిరుత దాడి చేసిందని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట మార్చి ఎలుగుబంటి దాడి చేసినట్టు చెబుతున్నారని బాధితులు కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


ఏడాదిలో రెండో ఘటన 


తిరుమల నడక మార్గంలో ఈ ఏడాదిలోనే రెండు విషాధాలు చోటు చేసుకోవడం కాస్త కలవర పెట్టే అంశమే అంటున్న భక్తులు. జూన్‌లో జరిగిన చిరుత దాడిలో బాలుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడికి మెరగైన వైద్యం అందించింది టీటీడీ. పూర్తిగా కోలుకుతున్న తర్వాత తల్లిదండ్రులకు అప్పగించింది. 


ఇప్పుడు మాత్రం ప్రాణాలు పోయాాయి


లక్షిత విషయంలో మాత్రం ఘోరం జరిగిపోయింది. దాడి జరిగింది రాత్రి పూట కావడంతో భక్తులు, అధికారులు త్వరగా స్పందించలేకపోయారు. రాత్రంతా  గాలించినా చిన్నారిని కాపాడుకోలేకపోయారు. ఉదయం వరకు అసలు పాపను చిరుత ఎటు తీసుకెళ్లిందో కూడా తెలుసుకోలేకపోయారు. ఉదయం కొండకు వస్తున్న భక్తులు గుర్తించి చెప్పే వరకు ఆచూకి కనుగోలేకపోయారు. ఇదే తీవ్ర విషాదాన్ని నింపుతోంది. 


దాడి చేసింది చిరుతకాదు


ప్రస్తుతం చిన్నారి లక్షితపై దాడి చేసింది చిరుత కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.  ఎలుగుబంటి దాడిలో చిన్నారి లక్షిత చనిపోయినట్టు  ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు టిటిడి డిఏఫ్ఓ శ్రీనివాసులు. పాప ఒక్కర్తే వెళ్లే సమయంలో దాడి జరిగినట్టు వివరించారు. ఆ టైంలోనే పాపను ఎలుగుబంటి లాక్కెళ్లిపోయి ఉంటుందని అంటున్నారు. 


చిన్నారి లక్షిత మెట్ల మార్గంలో కాకుండా కాస్త పక్కన నడుస్తోందని ఆ సమయంలోనే దాడి జరిగిందని శ్రీనివాసులు తెలిపారు. పాప మృతిదేహం లభించిన ప్లేస్‌లో ఆనవాళ్ళు చూసతే ఎలుగుబంటి దాడి చేసినట్టుగా అనుమానిస్తున్నామన్నారు. 


రాత్రి ఆ ప్రాంతంలో ఏం జరిగిందో తెలియాలంటే సీసీ కెమెరాలు పరిశీలించాలని అంటున్నారు అధికారులు. ఆ విజువల్స్ చూడటంతోపాటు పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరింత క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. అవి వచ్చే వరకు దేనిపై కూడా పూర్తిగా నిర్దారణకు రాలేమంటున్నారు.