Tanuku News : పశ్చిమగోదావరి జిల్లా తణుకులో విషాద ఘటన చోటుచేసుకుంది. నిద్రపోతున్న మంచంపైనే ఓ యువతి సజీవ దహనం అయింది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ అయి ఈ ప్రమాదం జరిగిందని యువతి తల్లిదండ్రులు అంటున్నారు.  


అసలేం జరిగింది? 


తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ యువతి సజీవదహనం అయిన విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకు రూరల్ సీఐ సీహెచ్‌ ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దాపురం గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్‌, గజ్జరపు వసంత దంపతుల కుమార్తె హారిక (19)  ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే హారిక తల్లి వసంత మృతి చెందగా శ్రీనివాస్‌ రూప అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. రూప కొంతకాలం వైసీపీ తణుకు మండలం అధ్యక్షురాలిగా పనిచేశారు. తన మొదటి భార్య వసంతకు పుట్టింటి నుంచి రావాల్సిన ఆస్తి కోసం శ్రీనివాస్‌ కొన్నాళ్ల కిందట కోర్టును ఆశ్రయించారు. 


షార్ట్ సర్క్యూట్ గా చిత్రీకరణ 


ఈ వ్యవహారాల మధ్య వారి కుమార్తె హారిక మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. ముద్దాపురం వీఆర్‌వో, స్థానికులు సమాచారం మేరకు ఘటనాస్థలిని తణుకు రూరల్ సీఐతో పాటు ఎస్ఐ రాజకుమార్‌లు పరిశీలించారు. అయితే ఫోన్ ఛార్జింగ్‌ పెడుతుండగా షార్టు సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందని హారిక తల్లిదండ్రులు చెబుతున్నారు. హారిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు పోలీసులు. అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఆస్తి కోసం ఇంతకాలం ప్రేమగా నటించి, కోర్టులో తీర్పు తమకు అనుకూలంగా రాదనే ఉద్దేశంతో హారికను హత్య చేసి షార్టుసర్క్యూట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని హారిక మేనమామ, అమ్మమ్మలు ఆరోపిస్తున్నారు. హారిక తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.  


తల్లిదండ్రులపై అనుమానం వ్యక్తం 


తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో ముళ్లపూడి హారిక(19) అనే యువతి అనుమానస్పద మృతి చెందింది. ముద్దాపురంలోని ఆమె నివాసంలో మంచంపై దేహం మొత్తం కాలిపోయి స్కెలిటన్ ఒక్కటే కనిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం పెడతాడేపల్లి వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో హారిక బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మొన్నటి వరకూ కళాశాల హాస్టల్ లో ఉంటూ చదువుకుని ఈ మధ్య ఇంటికి వచ్చి అక్కడి నుంచి కాలేజ్ కు వెళుతున్నట్లు సమాచారం. మృతురాలు సవతి తల్లి ముళ్ళపూడి రూపారాణి, తండ్రి శ్రీనివాస్ లపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  సవతి తల్లి రూప తణుకు మండలం వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా పనిచేశారు. తండ్రి ముళ్ళపూడి శ్రీను మొదటి భార్య తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంకు చెందిన వసంత కుమారి మృతి చెందడంతో రూపను రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్య వసంత కుమారి అనుమానస్పద మృతిలో శ్రీనివాస్ నిందితుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఘటన చోటుచేసుకోవడంపై సర్వత్రా అనుమానం వ్యక్తం అవుతుంది.