సినిమాల ప్రభావం జనాల మీద ఏ మాత్రం ఉందో తెలియదు కానీ.. స్మగ్లర్ల మీద మాత్రం బాగానే ఉంది. అందులోనూ.. ఈ మధ్య వచ్చిన స్మగ్లింగ్ నేపథ్యమున్న సినిమా పుష్ప ప్రభావమైతే.. విపరీతంగా పడింది. పుష్ప సినిమాలో స్మగ్లర్ అయిన అల్లు అర్జున్ కొత్త కొత్త ఐడియాలతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే.. ఇక్కడ మాత్రం రియల్ స్మగ్లర్లు డ్రగ్స్, గంజాయిని పోలీసుల కంట పడకుండా రాష్ట్రాలు దాటిస్తున్నారు. కానీ.. పోలీసులు ఇచ్చే ట్విస్టులతో అడ్డంగా దొరికిపోయి జైలు పాలవుతున్నారు.


పుష్ప సినిమాలో గుట్టు చప్పుడు కాకుండా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే విధానం చూపించారు. పైన ఒకటి ఉంచి కింద ఎర్రచందనం దుంగలు పెట్టి అక్రమ రవాణ చేయడం అందులో ఉంది. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు గంజాయిని కొత్త కొత్త పద్దతుల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. డీసీఏంలో రూఫ్ ద్వారా ఎవరికీ తెలీకుండా యథేచ్చగా గంజాయి అక్రమ రవాణ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు స్మగ్లర్లు. ఈ మొత్తం రాకెట్ ఏపీ టు మహారాష్ట్ర వయా వరంగల్ రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పుష్ప సినిమా తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేసే ముఠాను వరంగల్ కమిషనరేట్ పరిధి లోని టాక్స్ ఫోర్స్ ఎల్కతుర్తి పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.


300 కిలోల గంజాయి పట్టివేత.. 


ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పైన డీసీఎం పై భాగంలో పెట్టి మహారాష్ట్ర తరలిస్తున్న గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులను వరంగల్ వద్ద పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. అనుమానం వచ్చి వాహనాన్ని తనిఖీ చేశారు. తనిఖీల్లో సుమారు రూ.75 లక్షల విలువైన 300 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయిని తరలిస్తున్న ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పారిపోయారు. ముఠా సభ్యుల నుంచి సెల్‌ఫోన్లు, డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.


ఏపీ తో మహారాష్ట్ర గంజాయి రవాణా.. 


గంజాయి తరలిస్తూ పట్టుబడిన నిందితులను వివరాలను, పట్టుబడిన గంజాయి విలువను మీడియా సమావేశం ఏర్పాటు చేసి వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '' ఎన్నికల నేపథ్యంలో ఎల్కతుర్తి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో  గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశాము. తనిఖీలలో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నాం. వాహనంలో 300 కేజీల ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించాం. ఈ గంజాయిని 5 మంది స్మగర్లు కలిసి ఏపీ జిల్లా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. వీరిలో ఇద్దరిని పట్టుకున్నాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.


అరెస్టు అయినవారిలో ఐదుగురు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కు చెందిన వారున్నారు. మరో ముగ్గురుని గుర్తించాల్సి ఉంది. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నాం. ముద్దాయిల నుంచి సెల్‌ఫోన్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.75 లక్షల రూపాయలు ఉంటుంది'' అని సి‌పి  అన్నారు.