చిట్ ఫండ్ మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. చిట్టీ ముగిశాక , తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగితే  వినియోగదారులను ముప్పు తిప్పులు పెట్టి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు.  ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుంటే కస్టమర్ల జీవితాలను ఆగమాగం చేస్తున్నారు. బడాబాబులు, పలు పార్టీల నేతలు సైతం ఈ పాపంలో వాటాలు తీసుకుంటూ బీదవాడి ఉసురు తీస్తున్నారు. కస్టమర్లతో చిట్టీలు కట్టించుకోవడం, నెలనెల క్రమం తప్పకుండా డబ్బులు వసూలు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్యే. ఎప్పుడైతే చిట్టీ మెచ్యూరిటీ సమయం వస్తుందో అప్పుడే అసలు కిటుకు మొదలవుతుంది. అప్పటి నుంచి వినియోగదారుడికి ఎలాంటి స్పందన ఉండదు. డబ్బులు ఎప్పుడిస్తారో కూడా తెలియదు, కనీసంగా ఫోన్లలో కూడా సమాధానం దొరకదు. ఆ మాటకొస్తే చిట్ ఫండ్ నిర్వాహకులు సదరు కస్టమర్లను తప్పించుకుని తిరుగుతారు. అనుకోకుండా ఎప్పుడైనా ఎదురైతే ఏదో ఓ కారణం చెప్పి తప్పించుకునే యత్నం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కస్టమర్లకు నరకం చూపించే క్రమంలో అందరూ ఒక్కటే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. పేర్లు వేరైనా, తమ ప్రయోజనం మాత్రం అంతిమంగా వినియోగదారులను నిండా ముంచడమే లక్ష్యమని చెప్పకనే చెబుతున్నాయి.


సొమ్ముతో వెంచర్లు


చిట్ ఫండ్ యజమానులంతా వినియోగదారుల సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. పోగైన డబ్బులను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెడుతున్నారు. తక్కువ ధరలు ఉన్న ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి, సమయాన్ని చూసి ఎక్కువ మొత్తంలో లాభాలు పొందుతున్నారు. వ్యవసాయ భూములు కొనడానికి వినియోగదారుల సొమ్మునంతా పెట్టుబడిగా పెట్టి వేడుక చూస్తుంటారు. ఏదో అవసరానికి చిట్టీ ఎత్తుకున్న వారు ఎంతకీ డబ్బులు చేతికి అందక పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయిన కస్టమర్లు నిలదీస్తే, సిబ్బందితో వారిపై దాడులు చేయిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాలు, ఫర్నిచర్ ను చిట్ ఫండ్ యాజమాన్యాలు తామంతట తామే నష్టపర్చుకుని, డబ్బులు అడిగినందుకు ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు జరిగాయని కూడా కస్టమర్లు వాపోతున్నారు. కస్టమర్లను విల్లాలు, వెంచర్లు అంటూ భ్రమల్లో విహరింపజేస్తున్నారు. కార్లలో సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లకు తీసుకెళ్లి రోజంతా తిప్పి, విలాసవంతమైన హోటళ్లలో డిన్నర్లు ఇప్పించి సాయంత్రానికి ఇళ్ల వద్ద దింపుతూ పబ్బం గడుపుకుంటున్నాయి. తమ సొమ్ము తమకు ఇవ్వడానికి ఇదంతా ఎందుకని ప్రశ్నిస్తే డబ్బులన్నీ వెంచర్లు, విల్లాల్లో పెట్టుబడులు పెట్టామని, లాభం రెట్టింపుగా రాగానే వాటా ఇచ్చేస్తామని కాలం వెల్లదీస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడు డబ్బులు లేవు.. ఓ ఫ్లాట్ తీసుకొండని ఉచిత సలహాలు ఇస్తున్నారు.


కాలిబూడిదైన కస్టమర్..


ఓ పేరుమోసిన చిట్ ఫండ్ యాజమాన్యం నిర్వాకంతో హన్మకొండ కాంగ్రెస్ భవన్ ఎదుట ఓ వ్యక్తిపై పెట్రోల్ దాడి కూడా జరిగింది. గడువు తీరిన తర్వాత రావాల్సిన చిట్టీ డబ్బులు అడగడంతో మధ్యవర్తిగా ఉన్న చిట్ ఫండ్ ఉద్యోగి భార్యతో సహా వెళ్లి కస్టమర్ పై పెట్రోల్ దాడి చేయించారు. ఈ ఘటనలో సెల్ షాపు నిర్వాహకుడు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడి రెండు రోజులు గడిచిన తర్వాత తుది శ్వాస విడిచిన విషయం ఎవరూ మరిచిపోలేనిది. ఇది కేవలం బయటకు వచ్చిన దారుణం మాత్రమే, ఇలాంటివి ఇంకా లోలోపల జరుగుతున్న ఘటనలు ఎన్నెన్నో. పలువురు వినియోగదారులు చిట్టీ డబ్బులకు తిరిగి విసిగిపోయి కుటుంబాలతో సహా వచ్చి నిరసన తెలిపిన ఘటనలూ ఉన్నాయి.  చిట్ ఫండ్ యజమాన్యాలు వినియోగదారులే దేవుళ్లు అనే సూక్తిని మరిచి, వారి పాలిట యముళ్ల మాదిరిగా వ్యవహరిస్తున్నాయి.



గతంలోనే పోలీసులు  చిట్ ఫండ్స్ యజమానులతో వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి సమావేశం నిర్వహించారు. వినియోగదారుల విషయంలో, చిట్టీల నిర్వహణలో నిబంధనలు పాటించాలని సూచించారు. విచ్చలవిడిగా చిట్స్ ప్రారంభిస్తే కఠినంగా వ్యవహరిస్తామని, వినియోగదారులను ఇబ్బందులుపెడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. . అయినా, చిట్స్ నిర్వాహకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. పైగా, కొందరు రాజకీయ నాయకుల అండదండలతో నిర్వాహకులు పేట్రెగిపోతున్నట్లు సమాచారం. బడాబడా లీడర్ల సపోర్ట్ తో చిట్స్ మేనేజ్మెంట్లు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా సాగుతోంది. కమిషనర్ స్థాయి వ్యక్తే స్వయంగా సమావేశాలు ఏర్పాటు చేసి, హెచ్చరించినా వ్యవస్థలో మార్పు లేదంటే నిర్వాహకులు ఎంతగా బరి తెగించారో అర్థమవుతోంది.


ఫిర్యాదులపై కమిషనర్ దృష్టి..


చిట్ ఫండ్స్ యాజమాన్యాల వేధింపులు తట్టుకోలేక లెక్కకు మిక్కిలి వస్తున్న ఫిర్యాదులపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించారు.  ఈ క్రమంలోనే బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పేరుమోసిన పలువురు చిట్ ఫండ్స్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చిట్ ఫండ్స్ కార్యాలయాల నిర్వహణ, నిబంధనలు, లావాదేవీలు జరుగుతున్న తీరు తదితరాలపై విచారణ జరుపుతున్నట్టు సమాచారం. వినియోగదారుల విషయంలో అనుసరిస్తున్న తీరు, డబ్బులు చెల్లించేటప్పుడు పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పై ఎంక్వైరీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా విచారణలో ఇంకా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి.  చిట్ ఫండ్స్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారణ జరుగుతుండగానే, పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు మొదలైనట్టు తెలుస్తోంది. బడా లీడర్లు కొందరు పోలీసులను లైన్లోకి తీసుకుని విచారణకు ఆటంకం కలిగిస్తునట్టు వినికిడి. చిట్ ఫండ్స్ యజమానులు రాజకీయ నాయకుల ఆర్థిక అవసరాలకు అండగా నిలుస్తుండడంతో వారిని కాపాడే పనిలో పడ్డారు.