శిశు విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను వరంగల్ పోలీసులు(Warangal Police) అరెస్టు చేశారు. ఇంతేజా గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవజాతి శిశువుల విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఒక శిశువును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ముదావత్ శారద, రుద్రారపు స్వరూప, అనురాధ అక్షయ్ కొరి, పాట్ని శైలబేన్, సల్మా యూనిస్ షేక్ ఆలియాస్ హరతి, ఓదేల అనిత ఉన్నారు. ప్రసుత్తం పరారీలో ఉన్నవారిలో సిద్దిపేట(Siddipeta)కు చెందిన ట్రాన్స్ జెండర్(Transgender) సునీత కూడా ఉన్నారన్నారు. ఈ ముఠా అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి(Tarun Josi) మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఒక శిశువు స్థానంలో మరో శిశువు
ముఠా సభ్యులైన రుద్రారపు స్వరూప, ఓదేల అనిత ఇద్దరు స్నేహితులు వీరికి సిద్దిపేటకు చెందిన ట్రాన్స్ జెండర్ సునీతతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో తాను పెంచుకోనేందుకు ఒక ఆడ శిశువు అందజేస్తే పెద్ద మొత్తంలో డబ్బు అందజేస్తానని ట్రాన్స్ జెండర్ సునీత స్వరూప, అనితకు తెలిపింది. డబ్బుపై ఆశతో స్వరూప, అనిత.. శారదకు తెలపడంతో వీరికి రూ.2 లక్షల 50 వేలకు ఆడ శిశువు అప్పగించేందుకు నిందితురాళ్లు మధ్య ఒప్పందం కుదిరింది. ప్రధాన నిందితురాలైన శారద ఆడశిశువును తీసుకోని గత నెల 22వ తేదీన వరంగల్ లో ట్రాన్స్ జెండర్ సునీతకు అందజేయడంతో ఒప్పందం ప్రకారం శారదకు 2 లక్షల 50వేల రూపాయలను అందజేసి తిరిగి సిద్దిపేట(Siddipeta) వెళ్లిపోయింది. తర్వాత ఆడ శిశువుకు ప్రాణంతకమైన వ్యాధి ఉందని గుర్తించిన ట్రాన్స్ జెండర్ సునీత శిశువు స్థానం మరో శిశువును(Infant) అందజేయాల్సిందిగా శారదపై ఒత్తిడి తెచ్చింది.
మహారాష్ట్ర ముఠా గుట్టురట్టు
శారద ఈ నెల పదో తేదీన మహారాష్ట్ర(Maharastra)కు చెందిన మరికొందరితో కలిసి మరో ఆడశిశువుని తీసుకోని వరంగల్ బస్టాండ్ పరిసరాల్లోని లాడ్జ్ కి చేరుకున్నారు. తమ వద్ద ఉన్న శిశువు అందజేసేందుకు మహారాష్ట్రకు చెందిన మహిళలు మరింత డబ్బును డిమాండ్ చేశారు. దీంతో శారద మహారాష్ట్రకు చెందిన వారి వద్ద శిశువు లాక్కోని సునీత వద్ద ఉన్న శిశువుని ఇచ్చి లాడ్జ్ నుండి పారిపోయారు. ఈ క్రమంలో లాడ్జ్ లో జరుగుతున్న శిశు విక్రయాలపై సమాచారం అందుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు(Child Welfare Officers) లాడ్జ్ లో ఉన్న మహారాష్ట్రకు చెందిన అనురాధ, శీలా, సల్మాల, వారి వద్ద ఉన్న శిశువు గురించి ప్రశ్నించారు. శిశువు తల్లిని తీసుకువస్తామని చెప్పి అక్కడి నుంచి మహారాష్ట్ర పరారయ్యారు. చైల్డ్ వెల్పైర్ విభాగం అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఇంతేజా గంజ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి శిశు విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు.