Warangal Man Suicide: ఓ దొంగతనం కేసులో విచారణ కోసం పోలీసులు ఓ యువకుడిని పిలిచారు. ఈక్రమంలోనే పోలీస్ స్టేషన్ కు వచ్చిన యువకుడు పీఎస్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం గుర్తించిన పోలీసు సిబ్బంది, స్థానికులు యువకుడిని వరంగల్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ యువకుడు ఈరోజు అతడు ఇవాళ మరణించాడు. వరంగల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఫిబ్రవరి 28వ తేదీన గీసుకొండ మండలం శాయంపేట గ్రామంలోని ఓ వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. బంగారం నగలు అపహరణకు గురయ్యాయి. ఇంటి యజమాని ఈ చోరీ పై గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి గీసుకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా చోరీ జరిగిన ఇంటి యజమాని అనుమానం వ్యక్తం చేసిన శాయంపేట గ్రామంలోని యువకుడు పోలం వంశీని విచారణ కోసం సోమవారం సాయంత్రం గీసుకొండ పోలీస్ స్టేషన్ కు పిలిచారు. తమ ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన యువకుడు వంశీ పురుగుల మందును కూల్ డ్రింక్ లో కలిపి బాటిల్ ను వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది.
అవమానంగా భావించే వంశీ ఆత్మహత్య?
పోలీస్ స్టేషన్ కు చేరుకున్న తర్వాత వంశీ తన వద్ద పురుగుమందు కలిసి ఉన్న కూల్ డ్రింక్ ను స్టేషన్ ఆవరణలోనే తాగినట్లు సమాచారం. వెంటనే విషయం గుర్తించిన పోలీసులు వంశీని తమ వాహనంలోనే వరంగల్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు వంశీ(26) మధ్యాహ్నం మృతి చెందాడు. శాయంపేటలో చోరీ జరిగిన ఇంటి యజమాని వల్లే ఇదంతా జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నట్లు తెలిసింది. అతను చెప్పడం వల్లే చోరీతో ఎలాంటి సంబంధం లేని వంశీని పోలీసులు విచారణ కోసం పిలిచారని అంటున్నారు. అంతేకాకుండా పోలీసులు విచారణ పేరుతో తనను స్టేషన్ కు పిలవడంతో అవమానంగా భావించిన వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం వంశీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, చికిత్స పొందుతూ మృతి చెందడంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, వేధింపులే ఇందుకు కారణమని... ప్రచారంలో వాస్తవం లేదని చెబుతున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
వరంగల్ పట్టణంలో ఓ మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మౌనిక మహబూబాబాద్‌లో రైటర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ లోని తన నివాసంలో శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కానిస్టేబుల్ మౌనిక కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుందని, ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు.
కేసు నమోదు చేసి మౌనిక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబుసభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. ఆమె తరఫు వారు మృతురాలు మౌనిక భర్త శ్రీధర్ పై అనుమానం వ్యక్తం చేశారు. భర్త వల్లే ఆమె చనిపోయిందని ఆరోపిస్తున్నారు. మౌనికది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యే అయి ఉంటుందని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మౌనిక ఇంటికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.