IPL Betting in Warangal:  ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల టైమ్ కావడంతో దేశ వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ లు ఊపందుకుంటున్నాయి. మ్యాచ్ ల ప్రారంభానికి ముందే బెట్టింగ్ దందాకు తెరలేపుతున్నారు. మ్యాచ్ లు, బ్యాట్స్ మెన్, బౌలర్ల పైనే కాక బాల్ బాల్ కు బెట్టింగ్స్ కాస్తున్నారు. సరిగ్గా ఇలాగే ఓరుగల్లు నగర శివారులో ముగ్గురు సభ్యుల ముఠా గుట్టుగా, క్రికెట్ బెట్టింగ్స్ కాస్తూ అక్రమ దందాకు తెరలేపారు. ఈ విషయంపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ డాక్టర్ ఎం.జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెరుపు దాడి చేశారు. చట్ట విరుద్ధంగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ బాగోతాన్ని బట్టబయలు చేశారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్ల సింగారంకు చెందిన ఆటో డ్రైవర్ లావుడ్య రాజేందర్ ఇంట్లో  ఈ వ్యవహారం అంతా సాగగా.. పోలీసులు దాడి చేశారు. డైమండ్ ఎక్స్ సి హెచ్ 9 పోర్టల్ అండ్ స్ప్రింటర్స్ బుక్ లో బెట్టింగ్ కాసిన 68 వేల రూపాయలతో పాటు 3 మొబైల్ ఫోన్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు.


లావుడ్య రాజేందర్, హన్మకొండ గుండ్ల సింగారంకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ కొర్ర ప్రమోద్ (29), హన్మకొండ వాజ్ పాయ్ కాలనీకి చెందిన సయ్యద్ అంకుస్ (35) లను అరెస్ట్ చేశారు. ఇంకా అదాలత్, చోట మసీద్ కు చెందిన హోటల్ వ్యాపారి నునావత్ తిరుపతి (30), హాసన్ పర్తికి చెందిన చిత్తరి కోటిలింగంలు పరారీలో ఉన్నారు. ఈ క్రమంలోనే కేసును కేయూ పోలీసులకు అప్పగించారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ కె.శ్రీనివాస రావు, ఎస్సైలు లవన్ కుమార్, ఎండీ నిస్సార్ పాషా, బి.శరత్ ల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.


ఇటీవలే నెల్లూరులోనూ ఇలాంటి ఘటనే


గతేడాది నవంబర్ లో నెల్లూరు జిల్లాపై క్రికెట్ బెట్టింగ్ మరక పడింది. గతంలో కొంతమంది ప్రజా ప్రతినిధుల్ని కూడా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఆ కేసు వ్యవహారం ఆ తర్వాత బాగా నిదానించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక, అప్పటి ముద్దాయిలే బాధితులుగా మారిపోయారు. కేసు తేలలేదు. అయితే తాజాగా మరోసారి క్రికెట్ బెట్టింగ్ భూతం నెల్లూరులో విస్తరిస్తోంది. పాత నెల్లూరు జిల్లా మరచిపోయిన ఈ సంస్కృతి ఇప్పుడు కొత్తగా ప్రకాశం జిల్లా నుంచి కలసిన ప్రాంతాల్లో బయటపడుతోంది. బెట్టింగ్ ముఠాలోని ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ దొంగతనం కేసు విచారిస్తుండగా బెట్టింగ్ వ్యవహారం బయటపడటం విశేషం.



మెట్రో ఎక్స్ అనే యాప్ ద్వారా..


వలేటివారిపాలెం మండలంలోని శ్రీను, కందుకూరుకు చెందిన విజయ్‌ అలియాస్‌ గోవా, యనమల నాగరాజులు మెట్రోఎక్స్‌ అనే యాప్‌ ద్వారా ఆన్‌ లైన్‌ లో క్రికెట్‌ బెట్టింగ్‌ లకు పాల్పడేవారని తెలిసింది. ఆ యాప్ ద్వారా వారు అప్పటికే పలువుర్ని మోసం చేశారు. కందుకూరు మండలం కొండముడుసుపాలెం గ్రామ సమీపంలో ఈ ముఠా బెట్టింగ్‌ లు నిర్వహిస్తుండేది. విచిత్రం ఏంటంటే.. బెట్టింగ్ లో ఆ ముగ్గురు దొంగలు డబ్బులు భారీగా పోగొట్టుకున్నారు. దీంతో వారు బెట్టింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. వారిచ్చిన సమాచారంతో కందుకూరు పోలీసులు బెట్టింగ్ ముఠాపై దాడి చేశారు. వారివద్ద రూ.4.42 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం కేసులో తీగ లాగితే, బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. గతంలో కూడా ఈ ముఠా గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహించేదని తేలింది. ఇప్పుడు పోలీసులు గట్టిగా ప్రయత్నించా బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు.