వరంగల్: నకిలీ చలాన్లతో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి పథకాల్లోని కార్మికుల బీమా సొమ్మును స్వాహా చేసేందుకు ప్లాన్ చేసిన ఏడుగురు ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ వర్ధన్నపేట, శాయంపేట, రాయపర్తి, ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యుల నుండి డేట్ క్లయిం జిరాక్స్ దరఖాస్తు ఫారాలు, సీపీయూ, మానిటర్, కలర్ ప్రింటర్, ఒక సెల్ఫోన్, పదివేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఏడుగురు అరెస్ట్.. వారి వివరాలివే
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 1. భూమిహర్ భాస్కర్ (36), సోమిడి, కాజీపేట్, హనుమకొండ జిల్లా. 2. బొచ్చు బిక్షపతి (32), ఎస్.సి కాలనీ, పర్కాల, హనుమకొండ జిల్లా. 3. మాలోత్ నెహ్రు (40), చంద్రు తండా, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా. 4. మాలోత్ వీరస్వామి(32), చంద్రు తండా, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా.. 5.మాలోత్ రవి(43), చంద్రు తండా, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా, 6. మాలోత్ శ్రీను చంద్రు తండా, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా. 7.అర్షం కమారస్వామి అలియాస్ పెద్దబాబు(48), నీరుకుళ్ళ, ఆత్మకూరు, హనుమకొండ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.


వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్
నకిలీ చలాన్ల కుంభకోణం కేసులో అరెస్టుకు  సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి మాట్లాడుతూ.. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ కార్మికుల కోసం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్మిక విభాగంలో పేరు నమోదుచేసుకోని గుర్తింపు కార్డు కలిగి ఉన్న భవన నిర్మాణ కార్మికులకు పది సందర్భాల్లో ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. ఈ సాయాన్ని అందజేసేందుకు ముందుగా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించాల్సి ఉంటుంది. 


కార్మిక శాఖ అధికారిణి సహకారంతో తతంగం
పర్కాల సహయక కార్మిక అధికారిణి తన డ్యూటీని విస్మరించి క్షేత్ర స్థాయిలో విచారణ జరపకుండా ప్రధాన నిందితుడు తన అల్లుడైన భూమిహర్ భాస్కర్ తో  అనధికారకంగా విచారణ జరిపించేది. ఇదే సమయంలో కార్మిక అధికారిణి అల్లుడు  భాస్కర్ ప్రభుత్వ సొమ్మును కాజేసేందుకు పథకంగా రూపొందించాడు. ఇందుకోసం నిందితుడు మిగితా నిందితులను వర్ధన్నపేట, రాయపర్తి, శాయంపేట, ఆత్మకూర్ ప్రాంతాల్లో ఏజెంట్లుగా నియమించుకున్నాడు. ప్రధాన నిందితుడు  కార్మిక శాఖలో సభ్యత్వం లేని వ్యక్తులు ఏవరైనా  ఆయా గ్రామాల్లో ఆకస్మికంగాగాని లేదా ప్రమాదవశాత్తు మరణించిన  సమాచారాన్ని ఏజెంట్ల నుండి సేకరించేవాడు.    ఇలా మరణించి వ్యక్తుల కుటుంబ సభ్యులను కార్మిక శాఖ నుండి భీమా మొత్తాన్ని ఇప్పిస్తామని వచ్చిన భీమా సొమ్ములో కొద్ది శాతం డబ్బు తీసుకుంటామని ఏజెంట్ల ద్వారా నమ్మించి వారి నుండి మరణించిన వ్యక్తికి సంబంధించి ఆధార్ మరియు ఇతర గుర్తింపు పత్రాలతో తీసుకోవడంతో పాటు బాధితుల ఈ ముఠా ఐదు నుండి పదివేలు రూపాయలు నుండి వసూలు చేసేది. 


సేకరించిన పత్రాలతో ప్రధాన నిందితుడు గతంలో కార్మిక శాఖ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు కోసం కార్మికులు మీసేవలో చెల్లించిన రుసుము సంబంధించి రశీదులను సేకరించి అరశీదులోని తేది స్థానంలో పాత తేదీలతో మీ సేవలో రుసుము చెల్లించినట్లుగా మీసేవ కేంద్రం రశీదు తరహలో నకిలీ రశీదు రూపోందించి మరణించిన వ్యక్తి ప్రస్తుతం జీవించి వున్నట్లుగా కార్మికశాఖలో దరఖాస్తు చేసుకోని కార్మిక కార్డును పొందేవారు. కార్మిక నుండి జారీ అయిన గుర్తింపు కార్డుల అధారంతో మరణించిన కార్మికుల భీమా సొమ్ము కొసం  ఈ ముఠా కార్మిక శాఖలో దరఖాస్తు చేసేవారు. ఇదే తరహలో ఈ ముఠా కార్మిక శాఖలో 29 దరఖాస్తులను అందజేసినట్లుగా సమాచారం. ఈ ముఠా కార్యకలపాలపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక పోలీసుల సాయం నిందితులను అదుపులోకి తీసుకోని స్థానిక పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.  


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- వరంగల్ సీపీ
ప్రభుత్వం అందించే పథకాల ద్వారా లబ్ది చేకూరుస్తామని  చెప్పి డబ్బులు వసూళ్ళ కు  పాల్పడుతున్న వ్యక్తులను నమ్మవద్దని, ఇలాంటి వారి గురించి సమాచారం ఎదైనా ఉంటే వరంగల్ కమిషనరేట్ వాట్సప్ నంబర్ 9491089257 కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.ఈ ముఠా సభ్యులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసిపి జితేందర్ రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్.ఐ లవణ్ కుమార్, వర్ధన్నపేట, శాయంపేట,రాయపర్తి, ఆత్మకూరు ఎస్.ఐలు రామారావు, రాజు, సుమన్, వీరభద్రయ్య, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుళ్ళు శ్యాంసుందర్, అశోక్,స్వర్ణలత, కానిస్టేబుల్లు  నాగరాజు, సృజన్, సురేష్, నవీన్, శ్యాం, శ్రీనులను పోలీస్ కమిషనర్ అభినందించారు.