Medaram Jatara 2024: వరంగల్: రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరిగే మేడారం మహా జాతర (Medaram Jatara) చూద్దామని ఆశపడిన ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వాటర్ సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వరంగల్ కు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.
వరంగల్ నగరంలోని బాలాజీ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. వాటర్ సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా తాండూర్ కి చెందిన కరణం బలేశ్వరి రవికుమార్ దంపతులు మేడారం జాతరను దర్శించుకోవాలని భావించారు. దంపతులు పిల్లలతో సహా వరంగల్ లోని బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న బలేశ్వరి పుట్టింటికి వచ్చారు. తాండూరు నుంచి రాత్రి సుమారు 8 గంటల వరంగల్ లోని బలేశ్వరి తల్లిగారి ఇంటికి చేరుకున్నారు.
ప్రయాణంలో అలసిపోయిన బలేశ్వరి, రవికుమార్ దంపతులు త్వరగా నిద్రపోయారు. అదే సమయంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న ఇద్దరూ చిన్నారులు శౌరితేజ(4) తేజస్విని (2) పక్కనే ఉన్న సంపులో పడి మృతి చెందారు. పిల్లలు కనిపించక పోవడంతో కాలనీ మొత్తం వెతికారు. ఈ క్రమంలో కుటుంబ కుటుంబసభ్యులు సంపులో చూడగా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు సంపులో కనిపించాయి. చిన్నారుల మృతదేహాలను సంపు నుంచి బయటకు తీసి.. వరంగల్ ఎంజీఎం మర్చూరికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శుక్రవారం రాత్రి 7- 8 గంటల ప్రాంతంలో ఇద్దరు పిల్లలతో కలిసి భార్యాభర్తలు హైదరాబాద్ నుంచి వచ్చారని స్థానిక మహిళ తెలిపారు. వాళ్లు త్వరగానే తిని నిద్రపోయారు. అంతా ఇంట్లోనే నిద్రించారని, రాత్రి 11 గంటలకు పిల్లలు కనిపించడం లేదని వెతికినట్లు చెప్పింది. మొత్తం వెతుకుతుంటూ సంపులో ఒకరు తేలుతూ, మరొకరు మునిగి కనిపించారని స్థానికురాలు వెల్లడించారు. జాతర చూద్దామని వస్తే ఇంత విషాదం జరుగుతుందని ఎవరూ ఊహించలేదని ఆమె అన్నారు.