Warangal Crime News: విలాసవంతమైన జీవితం కోసం ఓ వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గతంలో మోటార్ సైకిళ్లే లక్ష్యంగా చోరీలు చేసే అతడు చాలా సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయినప్పటికీ అతని ప్రవర్తన మార్చుకోకుండా దొంగతనాలకు పాల్పడుతూనే ఉన్నాడు. తాజాగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలు చేశాడు. ఓ ఇంటి తాలం పగులగొట్టి 5 వేల రూపాయల నగదు, ఓ మొబైల్ ఫోన్ దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కష్టపడి నిందితుడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 


నిందితుడి తండ్రి చంద్రయ్య మందమర్రిలోని సింగరేణి బొగ్గు గనులలో పని చేస్తున్నాడు. నిందితునికి ఏడుగురు అన్నదమ్ములు కూడా ఉన్నారు. అయితే ఇతడు మాత్రం చిన్నతనం నుంచే బడి మానేసి ఆవారాగా తిరుగుతూ బెల్లంపల్లిలో మోటార్ సైకిళ్లను దొంగలించగా బెల్లంపల్లి పోలీసులు పట్టుకొని జువైనల్ హోంకు తరలించారు. ఆ తర్వాత జువైనల్ హోం నుంచి బయటకు వచ్చినా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇలా నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ లోని జైల్లో శిక్ష అనుభవించాడు. వరంగల్ జైలులో ఉండగా రామకృష్ణపూర్ పోలీసులు  ఇతనిపై పీడి యాక్ట్ కూడా నమోదు చేశారు. అన్ని కేసుల్లో జైలు శిక్ష అనుభవించి నవంబర్ 18వ తేదీ 2022రోజు జైలు నుంచి బయటకు వచ్చాడు. 


ఈ క్రమంలోనే ఆసిఫాబాద్ వెళ్లిన సదరు నేరస్థుడు నవంబర్ 21వ తేదీ 2022 రోజున అర్ధరాత్రి ఓ ఇంటి ముందు పార్కు చేసి ఉన్న హీరో గ్లామర్ మోటార్ సైకిల్ ను దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. దొంగలించిన మోటార్ సైకిల్ పై డిసెంబర్ నెల మొదటి వారంలో వరంగల్ కు వచ్చి శివనగర్ ఏరియాలో తిరుగుతూ.. అర్ధరాత్రి ఒక తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి అక్కడ కూడా చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అయిదే ఇంటి తాళం పగులగొట్టిన నిందితుడు.. లోనికి ప్రవేశించి బీరువా తెరచి అందులోని ఉన్న డబ్బులతో పాటు వివో సెల్ ఫోన్ ను దొంగలించుకొని పారిపోయినట్లు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.  


వరంగల్ పోలీసుల ప్రత్యేక నిఘా..


వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు  అడిషినల్ డీసీపీ క్రైమ్స్ మరియు ఆపరేషన్స్ పుష్ప,  క్రైమ్  ఏసీపీ డేవిడ్ రాజు స్వీయ పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్ స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాస రావు, ప్రత్యేక టీములుగా  ఏర్పాటు చేసి ఐటీ కోర్ సల్మాన్ పాషా సహకారంతో నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలనే బూడిదగడ్డ  జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. నిందితుడు  TS 20 9627  నంబరు గల హీరో గ్లామర్ మోటార్ సైకిల్ పై వచ్చాడు. అతడిని పోలీసులు ఆపుతుండగానే.. నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలనే పోలీసులు అతడిని వెంబడించి మరీ పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి ఓ మోటార్ సైకిల్ తో పాటు వివో మొబైల్ ఫోన్, 5000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.