విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో శుక్రవారం పాత నేరస్థుడు లాకప్ చనిపోవడం కలకలం రేపుతోంది. విచారణ కోసం అదుపులోకి తీసుకున్న పాత నేరస్తుడు లాకప్ లోనే ఉరి వేసుకుని మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. మృతిలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసులో అనుమానాలు ఉండడంతో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మెజిస్ట్రియల్ విచారణ(Magisterial Enquiry) కు ఆదేశించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగ శాంతినగర్ కు చెందిన సురేష్ అలియాస్ బేతా రాంబాబు(42) పాత నేరస్తుడు. ఇటీవల నెల్లిమర్లలోని ఉపాధి హామీ పథకం కార్యాలయంలో బ్యాటరీల దొంగతనం కేసులో రాంబాబును పోలీసులు విచారణ చేశారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో గాజులరేగలోని శాంతినగర్ లో తన ఇంట్లో ఉన్న రాంబాబును మరోసారి అదుపులోకి తీసుకున్న నెల్లిమర్ల పోలీసులు.. రాత్రంతా విచారణ చేశారు. కాగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో నెల్లిమర్ల పోలీస్ స్టేషన్(Nellimarla Police Station) లో రాంబాబు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, జరిగిన విషయాన్ని పైస్థాయి పోలీసు అధికారులకు సమాచారం అందించామని నెల్లిమర్ల పోలీసులు చెబుతున్నారు. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీసు అధికారులు, ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుడు రాంబాబు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 



మేజిస్ట్రియల్ విచారణకు కలెక్టర్ ఆదేశం 


నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో లాకప్ లో వ్యక్తి మృతి చెందాడన్న వార్తలు గుప్పుమనడంతో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి(Collector Surya kumari)స్పందించారు. లాకప్ లో వ్యక్తి మృతిపై అనేక అనుమానాలు ఉండడంతో మేజిస్ట్రియల్ విచారణ జరిపిస్తామని కలెక్టర్ వెల్లడించారు. విజయనగరం ఆర్డీవో భవానీ శంకర్ ను విచారణ అధికారిగా నియమించారు. దీంతో ఆర్డీవో భవానీ శంకర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని మార్చురీకి చేరుకొని చనిపోయిన రాంబాబు మృతదేహాన్ని పరిశీలించారు. మొత్తం ఘటనపై ఆర్డీవో భవాని శంకర్ మాట్లాడుతూ.. పోలీసులు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారని, మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసు స్టేషన్ లో ఆ సమయంలో ఉన్న విచారణ అధికారులను పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, అనంతరం వివరాలు వెల్లడిస్తామని అన్నారు.


పోలీసుల ప్రయత్నాలు!


రాంబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పాత నేరస్థుడు రాంబాబు లాకప్ లో మృతి(LockUp Death) చెందడంతో పోలీసులు ఈ కేసు నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాంబాబు భార్యను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తెల్లవారు జామున తీసుకెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. లాకప్ డెత్ లో పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్ల, థర్డ్ డిగ్రీ ఉపయోగించి రాంబాబును హింసించడం వల్ల చనిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుని భార్య సహాయంతో తమ పైకి కేసులు రాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తమ తండ్రిని రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు వచ్చి పట్టుకెళ్లారని, తెల్లవారుజామున వచ్చి తమ తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారని రాంబాబు కుమార్తె చెబుతుంది.  మొత్తం ఘటనపై ఆర్డీవో భవానీ శంకర్ విచారణలో ఏం తేలుతుందన్న దానిపై పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.


Also Read: వీరి వద్ద దొంగల తయారీ జరుగును, ఇంటికి తాళం వేసి ఉంటే ఇక అంతే.. కీలక వివరాలు చెప్పిన ఎస్పీ