Vizianagaram Murder Case: విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం దీపిక తెలిపారు. రాజాం మండలం కొత్తపేట వద్ద ఉపాధ్యాయుడు కృష్ణ హత్య కేసులో ప్రధాన నిందితుడు వెంకట నాయుడు సహా మరో ముగ్గురు నిందితులు మోహన్, గణపతి, రామస్వామిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నలుగురు నిందితులు కలిసే కృష్ణను హత్య చేసినట్లు తెలిపారు. గతంలో తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామంలో వెంకట నాయుడు కుటుంబీకులు ప్రభుత్వ నిర్మాణాల పనులు చేశారని.. ఇందుకు రెండు కోట్లు అప్పు చేసి పెట్టుబడులు పెట్టడం, ఈ బిల్లులు అవ్వకుండా టీచర్ ఏగిరెడ్డి కృష్ణ అడ్డం పడడంతో విపరీతమైన ద్వేషం పెంచుకున్నారని చెప్పారు. ఈ పగతోనే అతడిని హత్య చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే గత 20 ఏళ్లుగా నిందితుడు వెంకట నాయుడుకి, టీచర్ కృష్ణకి మధ్య ఆధిపత్య పోరు ఉందని జిల్లా ఎస్పీ వివరించారు. గతంలో రెండు వేర్వేరు పార్టీలో ఉన్నారని... ప్రస్తుతం వైసీపీ లోనే ఉన్నట్లు తెలిపారు.


గత 20 ఏళ్లుగా రాజకీయంగా, ఆర్ధికంగా తమను దెబ్బ తీసాడనే కారణంతో.. వీరంతా హత్యకు ప్లాన్ చేశారని జిల్లా ఎస్పీ దీపిక వెల్లడించారు. అయితే హత్యకు ముందు రెక్కి చేశారని.. ఉదయం స్కూల్ కు బయల్దేరి వెళ్తున్న సమయంలో వెంటపడి బొలెరోతో గుద్ది, తరువాత రాడ్డుతో కొట్టి చంపారని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందని.. గ్రామస్థులెవరూ ఆవేశాలకు పోకుండా ఉండాలని సూచించారు. అనవసరంగా లా అండ్ ఆర్డర్ ని చేతులలోకి తీసుకోవద్దని చెప్పారు. అలాగే గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతుందని వెల్లడించారు.


ఏగిరెడ్డి కృష్ణ ఎలా చనిపోయారంటే..? 
విజయనగరం జిల్లా రాజాంలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు 58 ఏళ్ల ఏగిరెడ్డి కృష్ణ శనివారం ఉదయం రోజూలాగే తన ఇంటి నుంచి బైక్ పై బడికి బయలు దేరారు. తెర్లాం మండలం కాలంరాజుపేటలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన ఒమ్మి సమీపంలోని కొత్తపేటకు చేరుకోగానే ఓ బొలెరో వాహనం వచ్చి ఆయన బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే అది ముమ్మాటికీ హ్తయలాగే కనిపిస్తుందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి.. ఇది హత్యేనని తేల్చారు. మృతుడి కుమారుడు శ్రావణ్ కుమార్ కేసు పెట్టగా.. ఉద్దవోలుకు చెందిన మరడాన వెంకట నాయుడు, మోహన రావు, గణపతి, రామస్వామిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. 


హత్యకు కారణం ఇదేనా..? 
ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణ టీపీడీలో క్రియాశీలకంగా పని చేసే వారు. ముఖ్యంగా ఉద్దవోలుకు 1988 నుంచి 1995 వరకు సర్పంచిగా కూడా పని చేశారు. 1998లో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత నుంచి గ్రామంలో కృష్మ ఎవరికి మద్దతు తెలిపితే వారే సర్పంచిగా గెలిచేవారు. 2021 ఎన్నికల్లో ఆయన మద్దతుతో సర్పంచిగా నెగ్గిన సునీత ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ వైసీపీలో చేరారు. అప్పటికే ఆ పార్టీలో ఉన్న వెంకటనాయుడు దీన్ని జీర్ణించుకోలేక పథకం ప్రకారం కృష్ణను హత్య చేసినట్లు ఆయన భార్య జోగేశ్వరమ్మ, కుమారుడు శ్రావణ్ కుమార్, కుమార్తె ఝాన్సీ ఆరోపిస్తున్నారు. అయితే ముందుగా కృష్ణను వాహనంతో ఢీకొట్టి అనంతరం కొద్దిదూరం ఈడ్చుకెళ్లి రాడ్ తో తలపై మోదడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial