Vizianagaram Crime News :   తల్లికి బిడ్డే లోకం. బిడ్డ కంట్లో నీళ్లు కనపడితే.. తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. బిడ్డకు ఏ చిన్న బాధ కలగకుండా కంటికి రెప్పలా కాచుకుంటుంది. అందుకే ఈ సృష్టిలో అమ్మ స్థానం అన్నింటికన్నా గొప్పది. అలాంటి ఓ తల్లి.. ఏకంగా బిడ్డను వక్రమార్గంలోకి నెట్టాలని చూసింది. కాదంటే.. చిత్రహింసలు పెట్టింది. అమ్మతనానికే మాయనిమచ్చ తెచ్చే ఈ అమానుష ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.                                               


విజయనగరం జిల్లా కేంద్రం తోటపాలెం సమీపంలో ఓ వివాహిత.. పదో తరగతి చదువుతున్న కుమార్తె తో కలసి నివాసం ఉంటోంది. కుమార్తెతో వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నిస్తోంది. తన కుమార్తెను కూడా పలువురి వద్దకు వెళ్లాలని కొన్నాళ్లుగా ఆమె బలవంతం చేస్తోంది. తనకు అటువంటి పని ఇష్టం లేదని కుమార్తె ఎంత నచ్చజెప్పినా వినలేదు. చిత్రహింసలు పెట్టేది. నిద్రమాత్రలు ఇచ్చేది. నయానోభయానో తన దారికి తెచ్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఫలానా వారి వద్దకు వెళ్తే సినిమాలో అవకాశాలిప్పిస్తారని.. మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రలోభపెట్టింది. తల్లి పెడుతున్న చిత్రహింసలు భరించలేక ఆ బాలిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వారి నుంచి స్పందన లేకపోవడంతో, తెలిసిన వారి ద్వారా మీడియాను ఆశ్రయించింది. 


వెంటనే వారు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ కేసలి అప్పారావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనలతో బాలల సంక్షేమ సమితి సభ్యులు అక్కడకు చేరుకుని.. బాలికను ఆ చెర నుంచి తప్పించారు. తొలుత విజయనగరంలోని స్వధార్‌ హోమ్‌కు తరలించారు. అక్కడ బాలల సంక్షేమ సమితి సభ్యులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం విశాఖలోని సంరక్షణ గృహానికి తరలించాలని ఆదేశించారు. దీంతో చైల్డ్‌లైన్‌, బాలల సంరక్షణ సిబ్బంది బాలికను విశాఖకు తరలించారు.                                     


సదరు మహిళ మొదటి భర్త గతంలోనే ఆమెను వదిలి వెళ్లిపోయాడు. దీంతో  రెండో పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల తర్వాత అతను చనిపోయాడు. ప్రస్తుతం మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. మరి కొంత మందితో కూడా ఆమెకు వివాహేతర సంబంధాలు పెట్టుకుందని స్థానికులు చెబుతున్నారు.                     


ఈ ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ కేసలి అప్పారావు  తల్లిదండ్రులు పిల్లల పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించకూడదన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాలలు ఎక్కడైనా ఈ తరహా ఇబ్బందులకు గురైతే, ధైర్యంగా సమీపంలోని బాలలతో పని చేస్తున్న సంస్థలను సంప్రదించి రక్షణ పొందాలని సూచించారు. వారికి అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.