Vizag Court: బాలికపై లైంగిక దాడి కేసులో విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5000 జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి  రూ.4 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కేసు వివరాలు ఇవీ.. శోంట్యం గ్రామంలో బంజో రాము అనే వ్యక్తి కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. కుంటుంబ పోషణకు కూలీ పనులకు వెళ్లేవాడు. 2016 మార్చి 23న రాము భార్యతో కలిసి కూలీ పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ఒకటవ తరగతి చదువుతున్న తన ఆరేళ్ల కూతురిని ఇంట్లోనే వదిలి వెళ్లారు. 


పనులు ముగించుకుని రాము దంపతులు సాయంత్రం ఇంటికి వచ్చారు. ఆ సమయానికి పాప ఏడుస్తూ ఉండటంతో ఏమి జరిగిందని ఆరా తీశారు. అదే గ్రామానికి చెందిన లెంక అప్పలరాజు అనే వ్యక్తి  బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుసుకున్నారు. ఆనందపురం పోలీసు స్టేషన్‌లో తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరచగా నిందితుడికి న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. 


ఈ కేసు సోమవారం విశాఖపట్నం గౌరవ స్పెషల్ పోక్సో కోర్టులో తుది విచారణకు వచ్చింది. నిందితుడిపై వచ్చిన ఆరోపణులు రుజవడంతో న్యాయమూర్తి ఆనంది తీర్పు వెలువరించారు. లెంక అప్పలరాజుకు 20 ఏళ్ల జైలు  శిక్ష, రూ.5000 జరిమానా విధించారు. బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించారు. దీనిపై స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణ మాట్లాడుతూ.. బాధితులకు నాయ్యం జరిగేందుకు దిశ చట్టం స్పీడ్ ట్రయల్ ఉపయోగ పడిందన్నారు.


కేసు పరిష్కారం అవడానికి కృషి చేసిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణ, కేసు ట్రయిల్ జరడంలో పురోగతి చూపించిన నగర పోలీసు అధికారులు, కోర్టు కానిస్టేబుల్ పైడితల్లిని విశాఖ నగర పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ప్రయారిటీ కేసుల్లో నిందితులకు శిక్ష పడేంత వరకూ మానిటరింగ్ చేయాలన్నారు, ప్రతి ఉన్నతాధికారి 5 కేసులు మానిటరింగ్ చేసేలా ఆదేశాలు ఇచ్చామని, కేసుల విషయంలో క్రమం తప్పకుండా స్టేషన్ ఇ‌న్‌స్పె‌క్టర్లతో మాట్లాడుతూ ఉండాలని సూచించారు. ఎక్కువ కేసులు గల రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్‌పై నిరంతరం దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రతి నెలా పరిష్కారం అవుతున్న కేసుల సంఖ్య ప్రతి నెలా పెరగాలన్నారు. 


మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఏడాది జైలు 
విశాఖ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆగస్టు చివరి వారంలో సంచలన తీర్పు ఇచ్చింది. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి ఏడాది జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. 2020లో చాకా లోవాంగ్ అనే మహిళను నోవాటెల్ వద్ద ఉన్న  ఓ స్పాలో బ్యూటీషియన్ గా పని చేస్తున్నారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా దుప్పడ రాంబాబు ఆమె వెంట పడేవాడు.


 కొన్ని రోజులు ఆమెను అనుసరించిన తర్వాత జులై 31న చాకా లోవాంగ్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో తీవ్రగాయంగా పరిచి పరారయ్యాడు. బాధితురాలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 354, సెక్షన్ 354 ఏ కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. దుప్పడ రాంబాబును కోర్టులో పరిచారు. కేసు విచారించిన న్యాయస్థానం... దుప్పడ రాంబాబుకు ఏడాది జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. పోలీసులు తీసుకున్న చర్యలను కోర్టు అభినందించింది.