Visakha Swetha Case : విశాఖ ఆర్కే బీచ్ లో మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పదన రీతిలో మృతిచెందిన శ్వేత కేసులో మిస్టరీ వీడింది. శ్వేతది ఆత్మహత్యే అని విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం స్పష్టం చేశారు. ఈ కేసు వివరాలు తెలిపిన ఆయన... శ్వేత ది ఆత్మహత్యగా భావిస్తున్నామన్నారు. శ్వేతను అత్తమామలు, భర్త, బావ గారు వేధించారన్నారు. శ్వేత అనే యువతి మృతదేహం YMCA బీచ్ లో మంగళవారం అర్ధరాత్రి లభ్యం అయిందన్నారు. శ్వేత తల్లి రమాదేవితో తాను మాట్లాడినట్లు సీపీ తెలిపారు. 


అత్తింటివారి వేధింపులు


"శ్వేత భర్త కొద్ది రోజుల క్రితం ఉద్యోగం రీత్యా హైదరాబాద్ కి వెళ్లారు. మంగళవారం సాయంత్రం 06 :20 నుంచి 06:30 మధ్యలో భర్తతో మాట్లాడింది. 8 గంటలకు తిరిగి భర్త ఫోన్ చేశాడు. 08:15 కి శ్వేత కనిపించడంలేదని ఆమె తల్లి రమాదేవికి అత్తింటివారు సమాచారం ఇచ్చారు.  11 గంటల సమయంలో ఫిర్యాదు ఇచ్చారు. శ్వేత పేరిట 90 సెంట్ల భూమి ఉంది. ఆ భూమి తన పేరు మీదకి మార్చాలని మణికంఠ శ్వే్త ఇబ్బంది పెట్టారు. ఫిబ్రవరిలో ఒకసారి శ్వేత ఆత్మహత్యకి ప్రయత్నం చేసింది.  అత్తింటి వారు వేధింపులు కారణంగా గతంలో ఆత్మహత్యకి పాల్పడింది. శ్వేత చెప్పులు ఆర్కే బీచ్ లో 100 మీటర్లు దూరంలో లభ్యం అయ్యాయి. శ్వేత ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. పోస్ట్ మార్టం వీడియోగ్రఫి చేయించాం."- సీపీ త్రివిక్రమ్ 


గతంలోనూ ఆత్మహత్యాయత్నం 


శ్రీకాకుళం జిల్లా మూలపేటకు చెందిన శ్వేతకు ఏడాది క్రితం గాజువాకకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గురుమిల్ల మణికంఠతో పెళ్లి జరిగింది. ఆమె 5 నెలల గర్భిణి. ఇటీవల ఆఫీస్ వర్క్ పై శ్వేత భర్త మణికంఠ హైదరాబాద్‌ వెళ్లారు. విశాఖలో అత్తమామలతో శ్వేత మంగళవారం సాయంత్రం అత్తింటివారితో గొడవ జరిగింది. ఆ తర్వాత భర్తతో ఫోన్‌లో మాట్లాడింది శ్వేత. అనంతరం శ్వేత సూసైడ్‌ నోట్‌ రాసి గదిలో పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయింది. శ్వేత పేరుపై కోటబొమ్మాళిలో ఉన్న 90 సెంట్ల భూమి తన పేరుపై రాయాలని భర్త మణికంఠ  ఒత్తిడి తెస్తున్నాడు. శ్వేత గర్భవతి అయిన తర్వాత పుట్టింటికి వెళ్లినప్పుడు ఆమె తల్లి ఎదుటే గొడవ జరిగింది. మణికంఠ శ్వేతపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో  అప్పుడే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించగా శ్వేత తల్లి కాపాడింది.  శ్వేత ఆడపడుచులిద్దరూ తరచూ ఇంటికి వచ్చి భర్త లేని సమయంలో శ్వేతను వేధిస్తుండేవారు. ఈ పరిణామాలు సూసైడ్‌ నోట్‌ ఆధారంగా శ్వేతది ఆత్మహత్యేనని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.  శ్వేత శరీరంపై కూడా ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టంలో తేలిందన్నారు.  


 



విశాఖ ఆర్కే బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన ఇరవై నాలుగేళ్ల శ్వేత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అత్తింటివారు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నందున ఆమె కన్నవారే అంతిమసంస్కరణలు నిర్వహించారు. కేసులో ఇప్పటి వరకు లభించిన ఆధారాలతో శ్వేత ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు, అత్త, ఆడపడుచుపై వరకట్న వేధింపుల కేసులు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆ దిశగానే విచారణ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో శ్వేత భర్త, అత్తామామ, ఆడపడుచు, ఆమె భర్త కూడా ఉన్నారు.