Chandrababu : జగన్ వి నవరత్నాలు కాదని, నవ మోసాలు అని ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో దళిత నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. జగన్ ఫొటో ఉండాల్సింది ఇంటి తలుపులపై కాదన్న చంద్రబాబు పోలీస్ స్టేషన్ లో ఉండాలని మండిపడ్డారు. ప్రత్యేకంగా ఎస్సీల కోసం ఒక్క బటన్ అయినా జగన్ నొక్కారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారులుగా దళితులను ఎందుకు నియమించలేదో చెప్పాలన్నారు. వీపీలుగా దళితులు పనికిరారా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దళితద్రోహి జగన్ అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో దళితులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కేఆర్ నారాయణన్‌ను రాష్ట్రపతి చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ను చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. నేషనల్ ఫ్రంట్‌గా ఉన్నప్పుడు అంబేడ్కర్‌కు భారతరత్న ఇప్పించిన ఘనత టీడీపీకే దక్కిందని చంద్రబాబు అన్నారు. యుగానికో రాక్షసుడు పుడతాడని.. జగన్ అలాగే పుట్టారని అన్నారు. ‘‘తల్లి అంటే ప్రేమ లేదు.. చెల్లి అంటే ప్రేమ లేదు.. ఓ బాబాయిని చంపించాడు.. మరో బాబాయిని జైలుకు పంపాడు. ఏమన్నా అంటే బటన్ నొక్కానంటున్నారు. ప్రత్యేకంగా ఎస్సీల కోసం ఒక్క బటన్ అయినా నొక్కారా..?. జగన్ ఇక్కడితో ఆగడు.. తన ఇంట్లోనే ఏదోకటి చేసుకుని.. మన మీదే ఆ నెపం నెట్టే ప్రయత్నం చేస్తారు’’ అని మండిపడ్డారు.
యర్రగొండపాలెంలో మనపైనే దాడి చేసి.. మనకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలనుకున్నారని విమర్శించారు. జగన్ కోడి కత్తి డ్రామా ఆడారన్నారు. జగన్ కళ్లల్లో ఆనందం చూడడానికి కత్తితో పొడిచానని.. కోడికత్తి శీనునే చెప్పాడని తెలిపారు. కోడికత్తి శీనును ఐదేళ్లుగా జైల్లో మగ్గేలా చేస్తున్నారని.. ఏ మాత్రం అవకాశం ఉన్నా కోడికత్తి శీనును కూడా చంపేస్తారేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. సలహాదారులుగా దళితులను ఎందుకు నియమించలేదు.. వారికి అర్హత లేదని జగన్ భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. వైస్ ఛాన్సలర్లుగా దళితులు పనికి రారా అంటూ నిలదీశారు.
‘‘యర్రగొండపాలెంలో నేనేమన్నాను...?. గతంలో వ్యవసాయం దండగ అన్నానని దుష్ప్రచారం చేసినట్టే.. ఇప్పుడు నేనేదో దళితులను విమర్శించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ జగన్ను తిడితే.. ఎస్సీలను తిట్టినట్టుగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దళిత ద్రోహి జగన్ అనే విషయాన్ని బలంగా చెప్పాలి. మంత్రి సురేష్ బట్టలిప్పేసి.. రోడ్ మీదకు వచ్చి వీరంగం వేశారు. అసలు బట్టలిప్పాల్సిన అవసరమేంటీ..?. నా మీద దాడి చేస్తే.. ఎన్ఎస్జీ కమాండోలతో కాల్పులు జరిగేలా ప్లాన్ చేశారు. ఇలాంటి పనులు చేసేవాడు ఓ మనిషా..? జగన్ సైకో’’ అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.