Visakhapatnam: నిన్న విశాఖపట్నంలో ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసిన జంట మృతదేహాలు బుధవారం లభ్యం అయ్యాయి. ముందుగా భర్త, ఉక్కు ఉద్యోగి వర ప్రసాద్ మృతదేహం.. అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి రాజుపాలెం దగ్గరలోని ఏలేరు కాలువ వద్ద దొరికింది. ఆ తర్వాత కాసేపటికే అదే కాలువకు మరికొంత దూరంలో భార్య మృతదేహం కూడా అక్కడే గుర్తించారు పోలీసులు. 


అసలేం జరిగిందంటే..? 


విశాఖపట్నంలో దంపతులకు చెందిన ఓ సెల్ఫీ వీడియో సంచలనం అయింది. తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా వారు రోదిస్తూ సెల్ఫీ వీడియోలో చెప్పి బంధువులకు పంపారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని స్టీల్ ప్లాంట్ ఉద్యోగిగా గుర్తించారు. తిరుమల నగర్‌లో ఉంటున్న 47 ఏళ్ల చిత్రాడ వరప్రసాద్.. విశాఖ ఉక్కు కర్మాగారం ఎస్ఎంఎస్-2 విభాగంలో పని చేస్తున్నాడు. ఇతనికి 41 ఏళ్ల భార్య మీరా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కుమారుడు కృష్ణసాయితేజ, కుమార్తె దివ్యలక్ష్మి ఉండగా... కుమార్తెకు గతేడాది వివాహం జరిగింది. ఇవీటలే ఆమెకు ఓ బిడ్డ కూడా పుట్టింది. అయితే కుమారుడు కృష్ణ సాయి తేజ బ్యాటరీ దుకారణం నిర్వహిస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఆర్థిక సమస్యలు ఎక్కువై తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వాపోయారు. 


ఆ సెల్ఫీ వీడియో బయటికి రావడంతో వారి కుమారుడు కృష్ణ సాయితేజ దువ్వాడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ దంపతుల కోసం వెతగ్గా.. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాలువ దగ్గర చెప్పులు, హ్యాండ్ బ్యాగు, ఓ సెల్ ఫోనును గుర్తించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు నిన్నటి నుంచి అక్కడే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నేడు మృతదేహాలు లభ్యం అయ్యాయి. 


సెల్ఫీ వీడియోలో ఏముందంటే..?


"ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాం. మేమిద్దరమూ వెళ్లిపోతున్నాం. మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్లను ఎవరూ ఏమీ అనొద్దు. ఒకవేళ ఎవరైనా ఏమన్నా.. పిల్లలూ పట్టించుకోకండి. అమ్మమ్మను చూసుకోండి. అల్లుడు గారు మా కుమార్తెను బాగా చూసుకోండి. మీకు ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోతున్నాం. ఏమీ అనుకోవద్దు."