Photographer murder for Camera at Ravulapalem in Konaseema District: విశాఖపట్నం: విశాకు చెందిన ఫొటోగ్రాఫర్ దారుణహత్యకు గురయ్యాడు. వెడ్డింగ్ ఫొటో షూట్ ఉందని పిలిచి సాయి కుమార్ అనే యువకుడ్ని హత్య చేశారు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) రావులపాలెం సమీపంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ ద్వారా మెస్సేజ్ చేసి పిలిచి ఫొటోగ్రాఫర్ (Visakhapatnam Photographer) సాయికుమార్‌ను హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో ఫొటోషూట్ ఆర్డర్..
విశాఖపట్నంలోని పీఎం పాలెం పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయికుమార్(23) ఫొటోగ్రాఫర్ గా చేస్తున్నాడు. ప్రి వెడ్డింగ్ ఫొటోషూట్, మ్యారేజ్, ఇతర ఫంక్షన్లకు ఫొటో షూట్, వీడియోలు తీస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎవరైనా ఈవెంట్, ఫంక్షన్లకు ఆర్డర్ చేస్తే.. వేరే ప్రాంతాలకు సైతం వెల్లి సాయికుమార్ ఫొటోషూట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఫేస్ బుక్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇద్దరు యువకులు ఫొటోషూట్ ఉందని సాయికుమార్ ని అడిగారు. ఈ యువకులు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందినవారు. ఓ 10, 15 రోజులపాటు వెడ్డింగ్ ఫొటోషూట్ ఉందని ఫిబ్రవరి 26న అతడ్ని పిలిచారు. తన వద్ద ఉన్న విలువైన కెమెరా, ఇతర సామాగ్రితో సాయికుమార్ మధురవాడ నుంచి కోనసీమ జిల్లా రావుల పాలెం వెళ్లాడు.
కారులో వచ్చి పికప్ చేసుకున్న నిందితులు..
విశాఖ నుంచి రైలులో రాజమహేంద్రవరం వెళ్లిన సాయికుమార్‌ను ఇద్దరు యువకులు కారులో వచ్చి పికప్ చేసుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో కానీ సాయికుమార్ రావులపాలెం సమీపంలో శవమై కనిపించాడు. తమ కుమారుడి నుంచి ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు రావడం లేదని.. తాము ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదని ఫొటోగ్రాఫర్ సాయికుమార్ తల్లిదండ్రులు విశాఖలోని పీఎం పాలెం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సాయికుమార్ కాల్ డేటా ఆధారంగా ఓ నిందితుడు షణ్ముఖ తేజను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. రూ.15 లక్షల విలువైన కెమెరా సామాగ్రి కోసమే సాయికుమార్‌ను ఇద్దరు నిందితులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
యువకుడి కుటుంబసభ్యులు ఏమన్నారంటే..
మృతుడు సాయికుమార్ కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. ఫొటోషూట్ ఆర్డర్ వచ్చిందని గత వారం వెళ్లాడు. వెళ్తున్నానని ఇంట్లో చెప్పలేదని సంచలన విషయాలు వెల్లడించారు. 15 రోజుల షూట్ ఉందని, అందుకే తమ ఈవెంట్ షూట్ కు సాయికుమార్ రాలేదని వేరే వాళ్లు చెబితే తమకు తెలిసిందన్నారు. తనకు అనుమానంగా ఉందని, ఫోన్ కలవకపోతే వేర్ నెంబర్ కు ట్రై చేయాలని మరో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లు తెలిపారు. ఫిబ్రవరి 26న ఫొటోషూట్ కు వెళ్లగా, 27న ఫోన్ చేస్తే కలవలేదని.. 28వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తన తమ్ముడ్ని తీసుకెళ్లిన వాడు దొరికాడని పోలీసులు నిన్న రాత్రి ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. ఫిబ్రవరి 27న తన తమ్ముడ్ని నిందితులు హత్య చేశారని పోలీసులు వెల్లడించినట్లు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.