Visakha Gold Smuggling : బంగ్లాదేశ్ నుంచి విశాఖకు అక్రమంగా తరలిస్తున్న 1.86 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు రూ.1.07 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. బంగారం స్మగ్లింగ్ పై సమాచారంతో  డీఆర్ఎస్ అధికారులు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో కోల్‌కతా నుంచి షాలిమార్-సికింద్రాబాద్ AC సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.12773)లో వచ్చిన స్మగ్లర్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. నిందితుల నుంచి రూ.1.07 కోట్ల విలువైన 1860.5 గ్రాముల బంగారాన్ని (కడ్డీలు, ముక్కల రూపంలో) స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి నుంచి రాబట్టిన సమాచారంతో సోదాలు చేశారు.  ఈ స్మగ్లింగ్ బంగారాన్ని బంగ్లాదేశ్ నుంచి తరలించినట్లు డీఆర్ఐ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు స్మగ్లింగ్ చేసి అక్కడ బంగారం కరిగించి, వివిధ ఆకారాలు, పరిమాణాల్లో బంగారు కడ్డీలు/ముక్కలుగా మార్చారు. కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులను  విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.  


అక్రమ ఆయుధాల కేసు 


అనంతపురం అక్రమ ఆయుధాల కేసులో  పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప మీడియాకు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన ఆరుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించారు. వారం రోజులు పాటు నిందితుల విచారణ సాగింది. నిందితుల ఇచ్చిన సమాచారంతో మధ్యప్రదేశ్ లో పోలీసులు దాడులు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలలో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. మొత్తం 9 అక్రమ ఆయుధాల తయారీ కేంద్రాలపై అనంతపురం పోలీసుల దాడులు చేశారు. ఈ తయారీ కేంద్రాల్లో 4 పిస్తోల్స్, 2 తూటాలు, 2 కేజీల గంజాయి స్వాధీనం  చేసుకున్నారు.  కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఈ కేసు విచారణకు  కేంద్ర దర్యాప్తు సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 22 తుపాకులు, 97 తూటాలు, 31 కేజీల గంజాయి, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కేసులో పురోగతి సాధించిన జిల్లా పోలీసులను డీజీపీ అభినందించారని, రూ.25 వేల రివార్డ్ ప్రకటించారన్నారు. 


హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం


హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్  పట్టుబడ్డాయి. సుమారు 18 లక్షల విలువైన డ్రగ్స్ ,178 గ్రాముల కొకైన్ హాయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన గాడ్విన్ ఇంపీయాగ్ ను  అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బెంగుళూరు నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకువస్తున్నట్లు హయత్ నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. గతంలో దుల్ పేట్ డ్రగ్స్ కేసులో గాడ్విన్ అరెస్ట్ అయ్యాడని అన్నారు. నిందితుడు నకిలీ పాస్ పోర్ట్ తో ట్రావెల్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. 3 నెలలో 400 సిమ్ కార్డులు ఉపయోగించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. 2015 లో చదువు నిమిత్తం హైదరాబాద్ వచ్చిన గాడ్విన్ ఇంపీయాగ్ ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలం ఉన్నాడని అన్నారు. వీసా గడువు ముగిసినా ఇల్లీగల్ గా దేశంలో ఉంటున్నాడని తెలిపారు. నిందితుడు రెండు పాస్ పోర్ట్ లు కలిగి ఉన్నాడన్నారు. బెంగళూరుకు చెందిన అస్లాం నుంచి డ్రగ్స్ తెచ్చాడన్నారు. బోర్నవిటా డబ్బాలో డ్రగ్స్ ను హైదరాబాద్ తీసుకొచ్చాడని చెప్పారు.


"బెంగళూరు నుంచి బస్ లో  హైదరాబాద్ కు డగ్స్ తీసుకొచ్చాడు. బెంగళూరు నుంచి 200 గ్రాములు తెచ్చాడని చెప్పుతున్నాడు. అందులో 178 గ్రాముల డ్రగ్స్ మాత్రమే దొరికింది. 28 గ్రాములు అమ్మేసినట్లు చెపుతున్నాడు. దూల్ పేట్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మూడు నెలల పాటు జైల్లో ఉన్నాడు. బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ ఈ దందా చేస్తున్నాడు."- ఎక్సైజ్ పోలీసులు