విశాఖలోని ఏఆర్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌ దందా బట్టబయలైంది. ప్రస్తుతం దిశ మొబైల్‌ వాహనంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సంతోష్‌ కొన్నాళ్లగా ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పలు పర్యాటక ప్రాంతాల్లో ఏకాంతంగా ఉండే ప్రేమికులను టార్గెట్ చేస్తున్నాడు. మరో వ్యక్తితో కలిసి ఏకాంతంగా కనిపించే ప్రేమికులపై బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్న విషయం వెలుగుచూసింది. నకిలీ కానిస్టేబుల్‌ అవతారమెత్తిన వ్యక్తి నిత్యం ఖాకీ ప్యాంటు ధరించి ప్రేమికుల్ని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. 


రెండు రోజుల కిందట ఇదే తరహాలో ప్రేమికుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా అసలైన ఆరిలోవ పోలీసులకు చిక్కాడు. అతడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అప్పగించగా వారు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్‌ సంతోషే తనతో ఈ పని చేయిస్తున్నాడని, తాను ధరించిన ఖాకీ ప్యాంటు కూడా ఆయనదేనని తేలింది. ఏళ్ల తరబడి తాను వసూలు చేస్తున్న మొత్తాల్ని కొంత మినహాయించుకుని సంతోష్‌కు ఫోన్‌ పే చేస్తున్నానని చెప్పడంతో సంతోష్‌పై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఫోన్‌ పే లెక్కలు చూడగా రూ.లక్షల్లో వసూలు చేసినట్టు బయటపడిరది. దీంతో శనివారం సంతోష్‌కు సీఆర్‌పీసీ 41ఏ నోటీసుల ప్రకారం అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.


ఆరేళ్లుగా ప్రేమాయణం, పెళ్లి చేసుకోవాలని కోరడంతో ట్విస్ట్ 
ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. ఓ ట్రాన్స్ జెండర్ ను ప్రేమించానని తిరిగిన ఓ యువకుడు చివరకు కాదు పొమ్మనే సరిగి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించిన యువకుడు మోసం చేశాడని మనస్థాపనంతో ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజమహేంద్రవరంలో సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం సింహాచలానికి చెందిన మిద్దె ప్రణీత (29), సింహాచల నగర్ ప్రాంతానికి చెందిన పట్టా శ్రీను అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం ఓకే కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుందామని ప్రణీత, తన ప్రియుడు శ్రీనును కొంతకాలం కిందట అడిగింది. అప్పటినుంచి అతడు ప్రణితకు ముఖం చాటేస్తున్నాడు. ఇక లాభం లేదని భావించిన ట్రాన్స్ జెండర్ ప్రణీత తనను పెళ్లి చేసకోవాలని ప్రియుడు శ్రీనును  నిలదీయడంతో తనకు సంబంధం లేదన్నాడు.


ఆమెను ప్రేమించి మోసం చేయడంతో పాటు, నీ చావు నువ్వు చావు అని హేళన చేశాడు. ప్రియుడు శ్రీను అన్న మాటలతో మనస్తాపం చెందిన ప్రణీత ఈనెల 19వ తేదీన  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అపరస్మారక స్థితిలో ఉన్న ప్రణితను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తాడితోటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ప్రణీత మృతి చెందింది. విషయం తెలుసుకున్న ట్రాన్స్ జెండర్ సంఘాలు తాడితోటలోని ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. ట్రాన్స్ జెండర్ మృతికి కారుకుడైన శ్రీను  కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు దళిత సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు.