Andhra University Ganja : ఏపీలో నిత్యం ఏదో చోట గంజాయి పట్టుబడుతుంది. పోలీసుల కళ్లుగప్పి గంజాయి తరలిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో గంజాయి  గుప్పుమంది. ఆంధ్ర యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డులు గంజాయి విక్రయిస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి, నిందితులను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఆంధ్ర వర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ కారు డ్రైవర్ ఈ ఉదాంతంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ దాడుల్లో రెండు వాహనాలను సీజ్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఏకంగా ఏయూలో గంజాయి పట్టుబడడంతో తీవ్ర కలకలం రేగింది. ఏకంగా సెక్యూరిటీ గార్డులు గంజాయి విక్రయిస్తుండడంతో సంచలనం అయింది. అయితే ఇప్పుడు సెక్యూరిటీ గార్డులు గంజాయి ఎవరికి విక్రయించారో విచారణ చేపట్టారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.  


గంజాయి రవాణాపై ఉక్కుపాదం 


విశాఖ నగరంలో గంజాయి అక్రమ రవాణాపై సెబ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ముందస్తు సమాచారం మేరకు బృందాలుగా ఏర్పడిన సెబ్ పోలీసులు వేపగుంట జంక్షన్ నుంచి హనుమంత వాక వరకు సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి 150 కేజీల గంజాయి, గంజాయి తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. నగరంలోకి భారీగా సరఫరా అవుతుందని సమాచారం రావటంతో SEB అధికారులు వేపగుంట జంక్షన్ వద్ద రూట్ వాచ్ నిర్వహించారు. అధికారులను గమనించిన స్మగ్లర్లు కార్ ను అడవివరం జంక్షన్ మీదుగా హనుమంతవాకకు మళ్లించారు. మరో SEB అధికారుల బృందం హనుమంతువాక వద్ద కాపు కాయడంతో గంజాయితో సహా కారును వదిలేసి నిందితుడు పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న విశాఖపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  అధికారులు కారును గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన నిందితులను గుర్తించి త్వరలోనే అరెస్టు చేయడం జరుగుతుందని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ బమ్మిడి శ్రీనివాసరావు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా అడ్డుకోవడంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని SEB జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 


వైజాగ్ నుంచి హైదరాబాద్ కు 


ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ నుంచి తెలంగాణ హైదరాబాద్ కు  గంజాయిని తరలిస్తుండగా ఓ వ్యక్తిని బాచుపల్లి పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 41 కిలోల గంజాయి, ఫోన్, కియా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ చింతల్ కు చెందిన శివరాత్రి నరేందర్ వైజాగ్ నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్నాడు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్సీఆర్ కాలనీ వద్ద పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 41 కిలోల గంజాయి సెల్ఫోన్ కియా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.