Vikarabad News : వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లిలో దారుణం జరిగింది. దోమ గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడి ఇంటి వద్ద అతని ప్రియురాలు గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్ ఈసీఐఎల్ కు చెందిన యువతిని నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి తల్లి ఆరోపిస్తుంది. ఇప్పుడు కట్నం పేరుతో మోహం చాటేస్తున్నాడని అందుకే యువతి మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపింది. బంజారా హిల్స్ లో ఓ సూపర్ మార్కెట్ లో పని చేస్తున్న వీరువురికి ఆరు నెలల క్రితం పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన నవీన్ ఇప్పుడు మోహం చాటేశాడు. 


పది లక్షల కట్నం డిమాండ్


వారం రోజుల క్రితం యువతి ఇంట్లో చెప్పకుండా యువకుడి ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటానని మొండికేసింది. గ్రామ సర్పంచ్, కొందరు పెద్దలు మీ ఇంట్లో పెద్దవారిని తీసుకుని వస్తే మాట్లాడి ఒప్పిద్దామని యువతికి నచ్చజెప్పి తిరిగి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు యువతితో కలిసి యువకుడి ఇంటికి వచ్చారు. పది లక్షల కట్నం, పది తులాల బంగారం ఇస్తే గాని పెళ్లి చేసుకునేది లేదంటూ యువకుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆవేశానికి లోనైన యువతి అక్కడే ఉన్న బ్లేడ్ తో గొంతు కోసుకుంది. యువతిని వెంటనే పరిగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు ఆమె కుటుంబసభ్యులు. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చి ప్రథమ చికిత్స అందజేసి హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. 


ప్రియుడి భార్య మర్డర్ 


అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నం ఆకుల వారి వీధిలో ఇల్లు దగ్ధమై ఇద్దరు సజీవ దహనమయ్యారు. ముందు ప్రమాదం అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో కళ్లుబైర్లకమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి.  వివాహేతర సంబంధం కారణంగానే అదే గ్రామానికి చెందిన మహిళ ఈ దారుణానికి ఒడిగట్టిందని తేల్చారు. తన ఇద్దరి కుమార్తెలతో కలిసి కుట్ర చేసినట్టు విచారణలో వెల్లడైంది. 


కేసులో నిందితులుగా ఉన్న సుంకర నాగలక్ష్మి, ఆమె ఇద్దరు కుమార్తెలు సుంకర సౌజన్య, దివి హరితను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వీరికి రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈనెల రెండో తేదీ కొమరగిరి పట్నం గ్రామంలో సాధనాల మంగాదేవి, ఆమె కుమార్తె మేడిశెట్టి జ్యోతి ఒకే గదిలో నిద్రిస్తుండగా అగ్ని కీలలు అంటుకున్నాయి. వేరే గదిలో పడుకున్న మృతురాలు మంగాదేవి భర్త లింగయ్యలో ప్రాణాలతో బయటపడ్డాడు. చాలా మంది ఇది ప్రమాదమే అనుకున్నారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్‌ మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. 


మంగాదేవి భర్త లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించారు. సాక్ష్యుల చెప్పిన వివరాలతో జ్యోతి భర్త మేడిశెట్టి సురేష్‌ని విచారించారు పోలీసులు. అతను చెప్పిన మాటలకు పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న జ్యోతిని ప్రేమించి పెళ్లి తాను గోడితిప్ప గ్రామంలో కాపురం పెట్టామన్నాడు. అక్కడ తను ఆటోలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన భార్య జ్యోతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానం కలిగేలా ప్రేమలేఖలు రాశారని చెప్పాడు. తాము ఉంటున్న ఇంటి పరిసరాల్లో కూడా పడేశారని వెల్లడించాడు. 


ఈ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయి నిజాలు తెలిశాయి. మృతురాలు జ్యోతి భర్త సురేష్‌కి, సుంకర నాగలక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తేలింది. కుటుంబం అవసరాలకు సురేష్ డబ్బులు ఇచ్చే వాడని కూడా స్పష్టమైంది. జ్యోతితో పెళ్లైన తర్వాత ఈ సంబంధానికి బ్రేక్ పడింది. సుంకర నాగ లక్ష్మితో మాట్లాడటం మానేశాడు సురేష్. డబ్బులు కూడా ఇవ్వడం మానేశాడు. దీంతో సురేష్‌, జ్యోతి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింది నాగలక్ష్మి. తన ఇద్దరు కుమార్తెలను అందుకు వాడుకుంంది. గ్రామంలో ఒక షాపులో కలర్స్ పేపర్లు కొని సురేష్‌కు జ్యోతిపై అనుమానం వచ్చేలా లెటర్స్‌ రాసింది. అయినా సురేష్‌ జ్యోతిపై అనుమానం రాలేదు... నాగలక్ష్మివైపు చూడటం లేదు. దీంతో జ్యోతిని ఎలిమినేట్ చేస్తే తప్ప తన లైన్‌ క్లియర్ కాదని భావించింది. ఈ నెల రెండున తెల్లవారుజామున కుమార్తెల సాయంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఆ మంటల్లో సురేష్ భార్య జ్యోతి, జ్యోతి అమ్మ మంగాదేవి చనిపోయారు. ఇంటికి మంటలు అంటుకొన్నప్పుడు జ్యోతి తండ్రి లింగయ్య ఆ మంటలకు నిద్రలేచి తన భార్య కుమార్తెలను రక్షించే ప్రయత్నం చేసినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది.  అతను ప్రాణాపాయం తప్పించుకొని బయట పడ్డాడు.