Vikarabad Crime News: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ చదివే ఓ విద్యార్థిని హత్యకు గురైంది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటు వెళ్లిన ఆమె ఆదివారం ఉదయం నీటి కుంటలో శవమై తేలింది. అయితే ఆమె మృతదేహంపై రక్తపు మరకలు ఉండడంతో హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కానీ ఆమెను ఎవరు, ఎందుకు, ఎలా హత్య చేశారు ఇంకా తెలియరాలేదు. 


అసలేం జరిగిందంటే?


వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల శిరీష.. శనివారం రోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపవుతున్నా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. తెలిసిన స్నేహితులు, బంధువులు అందరికీ ఫోన్ లు చేశారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆదివారం రోజు ఉదయం గ్రామ సమీపంలోని నీటి కుంటలో శిరీష శవమై తేలింది. విషయం గుర్తించిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే శిరీష మృతదేహంపై రక్తపు మరకలు ఉండడంతో ఆమెను ఎవరో హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్సై విఠల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


ముందుగా హత్య చేసి ఆ తర్వాతే మృతదేహాన్ని కుంటలో పడేసినట్లు పోలీసులు చెబుతున్నారు. శిరీష ఇంటర్మీడియట్ పూర్తి చేసి వికారాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. అయితే ఈమెను ఎవరు, ఎప్పుడు, ఎలా చంపారో త్వరలోనే తేలుస్తామని పోలీసులు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.


రెండ్రోజుల క్రితమే ప్రియురాలిని చంపిన ప్రియుడు 



సరూర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన వెంకట సాయికృష్ణ, అప్సర ఒకే వీధిలో ఉంటారు. సాయికృష్ణకు ఇప్పటికే వివాహమై ఓ పాప కూడా ఉంది.  అయితే.. అప్సరతో సాయికృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్ప‌టికే ఒక‌సారి ఆమె గ‌ర్భం దాల్చ‌డంతో సాయికృష్ణ అబార్ష‌న్ చేయించాడు. తాజాగా అప్స‌ర మ‌రోసారి గ‌ర్భం దాల్చ‌డంతో పెళ్లి చేసుకోవాల‌ని గ‌త రెండు నెలలుగా సాయి పై తీవ్ర ఒత్తిడి తీసుకువ‌స్తున్న‌ది. దీంతో ఆమెనుంచి తప్పించుకునేందుకు హ‌త్య చేయాల‌ని నిర్ణ‌యించుకుని ప‌క్క ప్లాన్ సిద్ధం చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. 


హత్య చేసిన తర్వాత రోజంతా కారులోనే మృతదేహం 


అప్సరను హత్య చేసిన తర్వాత అదే కారులో తీసుకొని ఇంటికి వచ్చిన సాయి.. డెడ్ బాడీని కారులోనే పెట్టి ఒక రోజు మొత్తం ఇంటి ముందే పార్క్ చేశాడు. మరుసటి రోజున డెడ్ బాడీ తీసుకువెళ్లి మ్యాన్‌ హోల్ లోంచి కిందికి పడేశాడు. మ్యాన్‌హోల్‌లో డెడ్ బాడీ వేసిన తర్వాత  అందులో మట్టిని నింపాడు. మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తుందని మట్టి నింపుతున్నట్లు అందర్నీ నమ్మించాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉదయం సమయంలో మ్యాన్‌హోల్‌లో మట్టిని నింపించాడు. అప్సర కనిపించకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. అప్సర కోసం పోలీసులతో పాటు నిందితుడు సాయి కూడా అన్నిచోట్ల వెతికాడు. పోలీసులు సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్‌ ట్రాక్‌ రికార్డును పరిశీలించారు. సాయి, అప్సర సెల్ ఫోన్లు మరుసటి రోజు ఒకే దగ్గర ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గురువారం రోజున సాయిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది.