నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిన్నాపూర్ శివారులో దారుణం జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని ఓ తల్లి తన ఆరు సంవత్సరాల వయసున్న కుమార్తెను చంపింది. ప్రియుడితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టింది. పోలీసులు విచారణ జరపగా, స్వయంగా నిందితురాలే నేరాన్ని ఒప్పుకున్నట్లుగా పోలీసులు వివరించారు. శవాన్ని మాక్లూర్ మండలం చిన్నాపూర్ అటవీ ప్రాంతంలో పడేశారు. ఆ సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించగా, అక్కడ ఆమె కుమార్తె శవం లభ్యం అయింది. పోలీసులు శవాన్ని పోస్టు మార్టానికి పంపించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయవాడలోని భవానిపురానికి చెందిన దుర్గా భవాని తన భర్త గురునాథంతో కలిసి మేస్త్రి పనులు చేసుకోవడానికి నిజామాబాద్ కు వచ్చింది. ఇద్దరూ కలిసి నిజామాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. వీరికి నాగలక్ష్మి (6), గీతా మాధవి (14 నెలలు) పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా కుటుంబ పోషణ భారం కావడంతో గురునాథం ఆటోను తీసుకొని నడుపుతున్నాడు.
చాలా కాలం నుంచి దుర్గ భవాని భర్తతో తరచుగా గొడవ పడుతూ ఉంది. ఈ క్రమంలో తన భర్తకు దూరంగా ఉండాలని భావించిన దుర్గా భవాని గత నెల రోజులుగా విడిపోయి దూరంగా ఉంటోంది. నిజామాబాద్ నగరంలోనే తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతంలో నివసిస్తుంది. అంతకుముందే ఆమెకు బాన్సువాడకు చెందిన ద్యారంగుల శ్రీను అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త గురునాథానికి తన భార్య దుర్గా భవాని ఎక్కడ ఉందో తెలియలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే, డబ్బుల కోసం దుర్గా భవాని తన తల్లికి ఫోన్ చేసింది. అప్పటికే గురునాథం తన భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో.. ఆమె తన అత్తకు ఫోన్ చేసిన విషయం పోలీసులకు చెప్పాడు. వారు ఆ ఫోన్ నెంబరు ఆధారంగా దుర్గా భవాని నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటున్నట్లుగా గుర్తించారు. గురునాథం భార్యను వెతుక్కుంటూ వచ్చాడు. పిల్లల గురించి ఆరా తీయగా చిన్న పాప నిద్ర పోతోందని, పెద్ద కుమార్తె ఆరేళ్ల నాగలక్ష్మి శ్రీను అనే తన బంధువుల ఇంటి దగ్గర ఉందని నమ్మ బలికింది. దీంతో భర్త నాకు తెలియని బంధువులు ఇక్కడ ఎవరు ఉన్నారని నిలదీశాడు. దీంతో పెద్ద కూతుర్ని చంపేసినట్లుగా ఒప్పుకుంది.
పోలీసులు ఈ విషయంపై దుర్గా భవానిని విచారణ చేశారు. అంతకుముందే తన కుమార్తె తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భావించి ఆమెను చంపేసినట్లుగా ఒప్పుకుంది. శ్రీనుతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా అంగీకరించింది. ఇద్దరు కలిసి బాలికను నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో గొంతు నులిమి చంపి.. మాక్లూర్ మండలం చిన్నాపూర్ అడవి ప్రాంతంలో పడేసినట్లుగా విచారణలో తేలింది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి అక్కడ లభ్యమైన బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. నిందితులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా మాక్లూర్ పోలీసులు వెల్లడించారు.