Chandrababu On Loan APPS : లోన్ యాప్ ల ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదిక‌గా వ్యాఖ్యానించారు. లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య  రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య ఘటన  మరువకముందే ఇవాళ పల్నాడులో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని చంద్రబాబు గుర్తుచేశారు.  ముఖ్యంగా మహిళల గౌరవాన్ని బజారుకీడుస్తూ వేధిస్తున్న ఇలాంటి లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అంతే కానీ చావు పరిష్కారం కాదని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం, పోలీసులు కూడా ఇటువంటి యాప్ ల గురించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాధితులకు అండగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు.  






ప‌ల్నాడులో యువ‌కుడి ఆత్మహ‌త్య 


ఆన్ లైన్ లోన్ యాప్ ల వేధింపులతో ప‌ల్నాడు జిల్లాలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన శివరాత్రి శివ(20) లోన్ యాప్ ద్వారా రూ.8 వేలు రుణంగా తీసుకున్నాడు. రూ.20 వేల వరకూ కట్టాలని  లోన్ యాప్ ఎగ్జిక్యూటివ్ లు వేధింపుల‌కు పాల్పడ్డారు. వేధింపులు భ‌రించ‌లేక శివ బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడ్డాడు. రాత్రి సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య  చేసుకున్నాడ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. లోన్ యాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వ‌రుస‌గా మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి రావ‌టంతో లోన్ యాప్ ల ఆగ‌డాలపై ఆందోళ‌న వ్యక్తం అవుతుంది.


డీజీపీకి తెలుగు మ‌హిళ‌ల ఫిర్యాదు 


లోన్ యాప్స్ వేధింపులపై డీజీపీకి తెలుగు మ‌హిళ‌లు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార సమితి అధ్యక్షురాలు ఆచంట సునీత ఆధ్వర్యంలో డీజీపీని కలిసిన మహిళలు, లోన్ యాప్ వేధింపులు రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. గతంలో మైక్రో ఫైనాన్స్, ఇప్పుడు లోన్ యాప్స్ రుణాలిచ్చి వడ్డీ, చక్రవడ్డీ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. వాయిదా చెల్లించడం ఆలస్యమైతే వేధింపులకు దిగుతున్నారన్నారు. లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు పెరుగుతున్నాయని లేఖలో తెలిపారు.  ప్రత్యేకంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని డీజీపీకి తెలిపారు. వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లోన్ యాప్స్ ను బ్యాన్ చేసేలా చొరవ తీసుకోవాలని డీజీపీని కోరారు.


పోలీసులు సూచ‌న‌లు ఇవే 



  • అనధికార లోన్ యాప్స్ జోలికి పోయి ప్రాణాలు మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

  • లోన్ యాప్స్ పై RBI నియంత్రణ ఉండదు. మీరు రుణం పొందాలంటే నేషనలైజ్డ్ బ్యాంకులను ఆశ్రయించి తగిన ప్రొసీజర్ ద్వారా రుణాలు తీసుకోండి.

  • లోన్ యాప్ నిర్వహించే నేరస్తులు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తక్షణమే మీ వ్యక్తిగత సమాచారంతో పాటు, ఫోన్ మెమరీలో ఉన్న ఫోటోలు వీడియోలు హ్యాక్ చేసి, బెదిరించి మీ వద్ద నుండి అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తారు.

  • తెలియని యాప్ లను డౌన్లోడ్ చేసే సమయంలో మీ ఫోన్ కాంటాక్ట్స్, మీడియా, గ్యాలరీ, కెమెరాలకు సంబంధించి ఆప్షన్స్ కు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే వ్యక్తిగత సమాచారం వారి చేతికి వెళ్లకుండా ఉంటుంది. 

  •  వాట్సాప్, టెలిగ్రామ్ ఇతర  UNKNOWN నెంబర్ల నుంచి మన సెల్ ఫోన్ వచ్చే లింకులను సాధ్యమైనంత వరకు ఓపెన్ చేయకుండా ఉండటం మేలు.

  •  లోన్ యాప్ లను డౌన్లోడ్ చేసుకునే సమయంలో అవి రిజిస్టర్ కంపెనీ అవునా కాదా పరిశీలించుకోవాలి. మోసపూరిత రుణ యాప్ ల పట్ల జాగ్రత్త వహించాలి

  •   ఎవరైనా లోన్ యాప్ ల ద్వారా రుణం పొంది తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించిన పిమ్మట, రుణ యాప్ల ప్రతినిధులు ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడి వేధింపులకు పాల్పడుతుంటే తక్షణమే సమీప పోలీస్ స్టేషన్లో గాని, సైబర్ మిత్ర హెల్ప్ లైన్ 1930 DAIL -100 కు గాని ఫిర్యాదు చేయాలి.

  •   పరిచయం లేని నెంబర్లనుండి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుంటే ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా వాద ప్రతిపాదనలు చేస్తూ, వారి ఉచ్చు నుండి తప్పించుకునేలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి.

  •  ఏజెంట్స్ ఎవరైనా ఫోన్ చేసి ఓటిపి గాని, పిన్ నెంబర్లు కానీ తెలుపమంటే బయటకి చెప్పవద్దు

  •   నగదు అవసరమైనప్పుడు బ్యాంకులలో, ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థలలో సరైన పత్రాలు సమర్పించి రుణం పొందడం ఉత్తమం. డాక్యుమెంటేషన్ లేదు కదా అని నకిలీ రుణ యాప్ల వలలో చిక్కుకోవద్దు.
     

  •  లోన్ ఆప్ లో ఇన్స్టాల్ చేసుకోగానే సైబర్ నేరగాళ్లు కొన్ని పర్మిషన్లు అడుగుతారు వాటిని ఇవ్వడం వలన మన యొక్క వ్యక్తిగత సమాచారం వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది.

  •  సమాచారం సేకరించుకున్న తర్వాత లోన్ యాప్ ల కేటుగాళ్లు లోన్ కట్టాలంటూ డిమాండ్ చేస్తూ కాంటాక్ట్ లిస్టులో ఉన్న ఫోన్ నెంబర్లకు లోన్ బాధితుల ఫోటోలను మార్పింగ్ చేసి వైరల్ చేస్తూ వారి కాంటాక్ట్ లిస్టులో ఉన్న గ్రూపులకు ఫార్వర్డ్ చేస్తు, వేధిస్తున్నారు.

  •   అప్పు తీసుకున్న దానికన్నా అధికంగా చెల్లించినప్పటికీ ఇంకా చెల్లించాలని యాప్ నిర్వాహకులు, ఏజెంట్లు బెదిరించడమే కాక, బాధితుల ఫోటోలను వీడియోలను అశ్లీలంగా చిత్రీకరించి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తు,ఆత్మహత్యలకు పాల్పడేలా వేధిస్తున్నారు

  •  పండగల సమయంలో వివిధ రకాల కంపెనీ పేర్లతో, నూతన ఆఫర్లు అంటూ, లాటరీ గెరుచుకున్నారంటూ కొన్ని రకాల మోసపూరిత యాప్ల నిర్వాహకులు ప్రజలను వలలో వేయడానికి లింకులను తయారు చేస్తున్నారు అలాంటి వాటి పట్ల జాగ్రత్త అని పోలీసులు సూచించారు.