Vijayawada Girl Kidnap : విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ లో మూడేళ్ల బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి బాలిక‌ను క్షేమంగా త‌ల్లిదండ్రుల వ‌ద్దకు చేర్చారు. జూన్ 8వ తేదీన విజయవాడ రైల్వేస్టేషన్ లోని 10వ నెంబ‌ర్ ప్లాట్ ఫామ్ పై మూడు సంవ‌త్సరాల బాలిక ఎస్.కె. హనీఫాను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లిపోయిన సంఘటన తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌నపై విజయవాడ జీఆర్పీ ఎస్పీ విశాల్ గున్నీ ప్రత్యేకంగా దృష్టి సారించ‌టంతో రైల్వే డీఎస్పీ పి.నాగరాజరెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాస్ కేసును ద‌ర్యాప్తు చేశారు. విజయవాడ, ఇబ్రహీంపట్నం రింగ్, హైదరాబాద్ వైపు వెళ్లే బస్ స్టాప్ వద్ద నలుగురు మహిళలు కిడ్నాప్ కు గురైన 3 సంవ‌త్సరాల బాలికతో కలిసి ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితుల‌ను సెక్షన్ 363 ప్రకారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 


రూ. 2 లక్షలకు అమ్మేందుకు 


పోలీసులు క‌థనం ప్రకారం విజ‌య‌వాడ పాత‌ రాజ‌రాజేశ్వరి పేట‌కు చెందిన‌ అమరవరపు లక్ష్మీ, గుడివాడ కార్మిక న‌గ‌ర్ కు చెందిన కోరుకొండ విజయలక్ష్మి, మేకల పద్మజ, తెలంగాణ సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన చంద‌న ప‌ద్మ బాలిక‌ను కిడ్నాప్ చేసిన‌ట్లుగా గుర్తించారు. ఇందులో అమరవరపు లక్ష్మీ సుమారు 10 రోజుల క్రితం కోరుకొండ విజయలక్ష్మి, మేకల పద్మజను పిలిచి విజయవాడ రైల్వేస్టేషన్ లో మూడేళ్ల బాలిక‌ను కిడ్నాప్ చేసేందుకు డీల్ మాట్లాడింది. ఇందుకు గాను రూ.25 వేలు డబ్బులు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. బాలిక‌ను కోరుకొండ విజయలక్ష్మి, మేకల పద్మజ ఇరువురు కలిసి సిరిసిల్లలో ఉన్న చందన పద్మ వద్దకు వెళ్లి మూడేళ్ల బాలిక‌ను రూ. 2 లక్షలకు అమ్ముతామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. జూన్ 8వ తేదీన అమరవరపు లక్ష్మీ, కోరుకొండ విజయలక్ష్మి మేకల పద్మజలకు ఫోన్ చేసి పాప విజయవాడ రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్ నెం.10లోని వెయిటింగ్ హాల్ వద్ద సిద్ధంగా ఉంద‌ని, వచ్చి తీసుకెళ్లమని సమాచారం ఇవ్వడంతో కోరుకొండ విజయలక్ష్మి మేకల పద్మజలు వచ్చి రైల్వేస్టేషన్ నుంచి బాలిక‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాలికను గుడివాడలోని మేకల పద్మజ ఇంట్లో ఉంచారు. 


తిరిగి తల్లిదండ్రుల చెంతకు బాలిక 


అయితే బాలిక కిడ్నాప్ వ్యవ‌హ‌రం తీవ్రస్థాయిలో క‌ల‌క‌లం రేపింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా బాలికను తీసుకువెళ్లిన మ‌హిళ‌ల‌ను గుర్తించారు. బాలిక కిడ్నాప్ పై పోలీసులు అప్రమ‌త్తం అయ్యారని తెలుసుకున్న మ‌హిళ‌లు బాలిక‌ను గుడివాడ‌లోనే ఉంచారు. మంగ‌ళ‌వారం తెల్లవారుజామున ఎవ్వరికీ తెలియ‌కుండా తెలంగాణ త‌ర‌లించేందుకు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గుడివాడ నుంచి ఇబ్రహీంప‌ట్టణం రింగ్ వ‌ద్దకు చేరుకున్నారు. అక్కడ బ‌స్ స్టాప్ లో చందన పద్మకు అప్పగించేందుకు ప్రయ‌త్నిస్తుండ‌గా పోలీసులు ప‌ట్టుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితుల‌ను కోర్టులో హాజరు పరిచారు. బాలిక (షేక్ హనీఫా)ను చైల్డ్ లైన్ ఐసీడీసీ వారి సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించామని పోలీసులు వెల్లడించారు.