Vijayawada News : విజయవాడ జింఖానా మైదానంలోని టపాసుల దుకాణంలో సంభవించిన అగ్ని ప్రమాదం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నలుగురిని అరెస్టు చేసినట్లు విజయవాడ డీసీపీ కొల్లి శ్రీనివాసరావు తెలిపారు. అనుమతికి మించి బాణాసంచా ఉంచడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాప్ యజమానులు గోపాలకృష్ణ, గోవింద రాజులు, పరిమితికి మించిన స్టాక్ ను  సరఫరా చేసిన కిషోర్, రామాంజనేయులను కూడా అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. లైసెన్స్ లేకుండా టపాసులు నిల్వ ఉంచితే  కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ప్రమాదం తీవ్రత 


విజయవాడ జింఖానా గ్రౌండ్స్ మైదానంలో దీపావళి పండుగ నాడు ఉదయాన్నే విషాదంగా మారిన ఘటన తెలిసిందే. మైదానంలో ఏర్పాటు చేసిన దీపావళి సామాగ్రి పేలి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ  కేసులో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. విజయవాడలో ఈ కేసు వివరాలను డీసీపీ కొల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. జింఖానా మైదానంలోని బాణాసంచా దుకాణాల్లో అగ్ని ప్రమాదానికి షాపు యజమాని నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. అనుమతి ఇచ్చిన దానికన్నా మించి బాణాసంచా ఉంచారని, గత ఏడాది ఉల్లి బాంబులను కూడా నాలుగు బస్తాలు అమ్మకానికి ఉంచారన్నారు. ఉల్లి బాంబులను సర్దే ప్రయత్నంలో కింద పడి పేలుడు సంభవించినట్లు వివరించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతికి కారణమైన గోపాల కృష్ణమూర్తి, గోవిందరాజులుతోపాటు వారికి బాణాసంచా సరఫరా చేసిన తాడేపల్లిగూడెంకి చెందిన కిషోర్, రామాంజనేయులును కూడా అరెస్ట్ చేశామని డీసీపీ వివరించారు. పరిమితికి మించి బాణసంచా విక్రయాలు చేస్తే ఇలాంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ఘటన తీవ్రత కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని పోలీసులు విచారం వ్యక్తం చేశారు.






తెర వెనుక రాజకీయంపై విమర్శలు 


విజయవాడ నగరంలోని జింఖానా మైదానంలో దీపావళి రోజు జరిగిన ప్రమాదం వెనుక రాజకీయ నేతల ప్రమేయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో కూడా దీపావళి బాణాసంచా విక్రయాల కోసం అనుమతులు ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంలో స్థానిక నేతల ప్రమేయం ఉండటం వల్లే రద్దీగా ఉన్న ప్రదేశాల్లో కూడా నిబంధనలు పాటించకుండా అధికారులు అనుమతులు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. ఇందులో అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రమేయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రమాదం జరిగిన తరువాత పోలీసులు, ఫైర్ సిబ్బంది, కార్పొరేషన్, రెవిన్యూ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. అనుమతి తీసుకున్న తరువాత దుకాణాలు నిర్వహించే వ్యాపారులు, వారికి స్టాక్ ను సరఫరా చేసిన వ్యక్తులపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సందర్భంలో కనీస నిబంధనలు పట్టించుకోకుండా, పెట్రోల్ బంకుకు 50 అడుగుల దూరంలో, నివాసాల మధ్య ప్రధాన రహదారిని అనుకొని ఉన్న ప్రాంతంలో అనుమతులు ఇచ్చిన అదికారులపై ఎందుకు చర్యలు లేవనే ప్రశ్నలు స్థానికంగా తలెత్తుతున్నాయి. దీనిపై పోలీసులు కూడా స్పందించటం లేదు.