Vijayawada Police SC ST Atrocity Case:  విజయవాడ నగరంలో  ఒక కీచక జిమ్ ట్రైనర్ దారుణానికి ఒడిగట్టాడు. బరువు తగ్గేందుకు జిమ్‌కు వచ్చిన ఒక ప్రైవేట్ స్కూల్ మహిళా టీచర్‌ను లక్ష్యంగా చేసుకుని, మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా న్యూడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు తెగబడిన సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు సదరు జిమ్ ట్రైనర్ షేక్ అబ్దుల్ ఖాదర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Continues below advertisement

 ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ప్రొటీన్ షేక్ నెపంతో హోటల్ గదికి!   

పోలీసులకు బాధితురాలు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 2026లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అబ్దుల్ ఖాదర్ ఆమెకు పరిచయమయ్యాడు.  కొద్దిగా లావుగా ఉన్నావు, సరిగ్గా డైట్ పాటిస్తూ జిమ్ చేస్తే సన్నబడతావు అంటూ నమ్మబలికి, సత్యనారాయణపురంలోని  రాక్ ఫిట్‌నెస్ వరల్డ్  జిమ్‌లో చేర్పించాడు. కొద్దిరోజుల తర్వాత, బరువు తగ్గే ప్రత్యేక ప్రొటీన్ షేక్ ఇస్తానని చెప్పి రామావరప్పాడు, సత్యనారాయణపురం పరిధిలోని ప్రైవేట్ హోటల్ గదికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ ప్రొటీన్ షేక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, ఆమె స్పృహ తప్పిన తర్వాత   అత్యాచారానికి ఒడిగట్టాడు.

Continues below advertisement

 ఐఫోన్, నగదు కోసం వేధింపులు.. కుల వివక్ష, బూతులు! 

రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు భయంతో కేకలు వేయగా, ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, సోషల్ మీడియాలో పెడతానని అబ్దుల్ ఖాదర్ బెదిరించాడు. ఆ ఫోటోల నెపంతో జూన్ వరకు ఆమెను పలుమార్లు బంధించి, విపరీతంగా కొడుతూ, కొరుకుతూ శారీరక హింసకు గురిచేశాడు. అంతటితో ఆగక భయభ్రాంతులకు గురిచేసి ఆమెతో ఐఫోన్ 16 కొనిపించుకోవడమే కాకుండా, విడతల వారీగా ఫోన్ పే ద్వారా రూ.70 వేలు వసూలు చేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి నిందితుడి ఇంటికి వెళ్లగా, అతని తల్లిదండ్రులు కులం పేరుతో తీవ్రంగా దూషించారు. 

 అనేకమంది అమ్మాయిలపై ట్రాప్.. జిమ్ ఓనర్ నిర్లక్ష్యం! 

ఆగ్రహించిన నిందితుడు ఆమె న్యూడ్ ఫోటోలను జిమ్‌లోని ఇతరులకు చూపిస్తూ మానసిక నరకం చూపించడంతో ఆమె జిమ్‌కు వెళ్లడం మానేసింది.   సదరు జిమ్ ట్రైనర్ ఇలాగే పలువురు యువతులను ట్రాప్ చేసి, వారందరి వీడియోలను ఫోన్‌లో పెట్టుకుని ఆర్థికంగా, శారీరకంగా దోచుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని జిమ్ ఓనర్ జి. సుధీర్ దృష్టికి తీసుకెళ్లగా, అతను బాధితురాలికి సాయం చేయకపోగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడు. జూలై 15న ధైర్యం చేసి జిమ్‌కు వెళ్లిన బాధితురాలిని నన్నేం పీకలేవు, ఎవరికైనా చెబితే చంపేస్తా అని ఖాదర్ బహిరంగంగా ప్రాణ బెదిరింపులకు దిగాడు.

కేసు నమోదు.. నిందితుడి కోసం   గాలింపు!  బాధితురాలు తన బాబాయి సాయంతో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సెక్షన్లు 376  , 384  , 506 తో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అబ్దుల్ ఖాదర్‌పై కేసులు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు అబ్దుల్ ఖాదర్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.  నిందితుడికి సహకరించిన జిమ్ ఓనర్ సుధీర్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.