Vijayawada News : విజయవాడ కృష్ణలంక బాలాజీ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి, పిల్లలు ఇంట్లో పురుగుల మందు తాగి పడిపోయినట్లు భర్త, స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల తల్లి లక్ష్మి, పిల్లలు నాగమణికంఠ, జయహర్షగా పోలీసులు గుర్తించారు.
ఏం జరిగింది?
విజయవాడ బాలాజీనగర్ కు చెందిన చలమలశెట్టి గోపాలకృష్ణ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతని పాయకాపురానికి చెందిన చందన లక్ష్మి(27)తో 2012లో పెళ్లి జరిగింది. వారికి నాగమణికంఠ(9), జయహర్ష(7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్లు కృష్ణలంక బాలాజీనగర్ లో నివసిస్తున్నారు. లారీడ్రైవర్‌గా పనిచేస్తున్న గోపాలకృష్ణ మద్యానికి బానిసై భార్య, పిల్లల పట్ల పెద్దగా ఆసక్తిని చూపేవాడు కాదు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన చందన లక్ష్మి గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో ఆసుపత్రిలో చేర్చగా ప్రాణాపాయం తప్పింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడం బంధువుల నుంచి కూడా ఓదార్పులేకపోవడంతో ఆమె మరింత కుంగిపోయింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్లిన చందనలక్ష్మి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది.
ఆ తర్వాత ద్రాక్ష జ్యూస్‌లో పురుగుల మందును కలిపి తాను తాగి, పిల్లలతో తాగించింది. రాత్రి ఇంటికి చేరుకున్న భర్త భార్య తలుపులు ఎంతసేపటికి తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో పగలగొట్టి ఇంట్లోకి వెళ్లాడు. బెడ్‌రూమ్‌లోని మంచంపై భార్య, పిల్లలు నురుగలు కక్కుతూ పడి ఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఘటనాస్థలానికి చేరుకుని వారి ఆసుపత్రికి తరలించారు. తర్వాత ముగ్గురూ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టు మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు