Vijayawada Crime : భర్తతో విడిపోయిన మహిళలను టార్గెట్ గా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న మోసగాడిని బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకు చెందిన నిందితుడు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలువురు మహిళలను మోసగించినట్లుగా పోలీసుల విచారణలో తెలిసింది. 


 పెళ్లి పేరుతో మోసం


మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేసి వారి వద్ద నుంచి డబ్బు, నగలను తీసుకుని పరారవుతున్న అంతర్ రాష్ట్ర మోసగాడు గట్టమనేని మనోహర్ అలియాస్ మనోహరన్ ను బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ నగరానికి చెందిన వివాహితను రెండో పెళ్లి పేరుతో వివాహం చేసుకొని ఆమె నుంచి బంగారం, నగదు దోచుకొని పరారయ్యాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి మనోహర్ ను అరెస్టు చేశారు. అతడిని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలను మోసం చేసినట్లు పోలీసులు నిర్థారించారు.


బస్సులో మాటలు కలిపి వివాహం వరకు 


విజయవాడకు చెందిన మహిళ  20 సంవత్సరాల క్రితం తన భర్తతో విబేధాల కారణంగా విడిపోయి కుమారుడితో కలిసి ఒంటరిగా ఉంటున్నారు. తన కుమారుడు కోసం హైదరాబాద్ వెళుతున్న సమయంలో బస్సులో మనోహరన్ పరిచయం అయ్యాడు. తనకు వివాహం అయ్యిందని అయితే విడాకులు తీసుకున్నానని, రెండో పెళ్లి కోసం ఒక వెబ్ సైట్ ద్వారా ప్రకటన ఇచ్చినట్లుగా వివరాలను చూపించారు. అయితే అదే వెబ్ సైట్ లో సదరు మహిళ కూడా రెండో వివాహానికి దరఖాస్తు చేసుకుంది. దీంతో మనోహరన్ సదరు మహిళతో ఈజీగా మాటలు కలిపాడు. ఈ ఏడాది మార్చి 4వ తేదీన  మంగళగిరిలోని దేవాలయంలో ఇరువురు వివాహం చేసుకున్నారు. మహిళకు చెందిన సొంత ఫ్లాట్ లోనే  నివాసం ఉంటున్నారు. 


మహిళ కుటుంబ సభ్యులను కూడా మోసం చేసి 


 మనోహర్ తన వ్యాపార నిమిత్తం మహిళ నుంచి పలు దఫాలుగా సుమారు రూ.5 లక్షలు తీసుకున్నాడు. అంతే కాదు  ఆమె తమ్ముడు వద్ద నుంచి 2.5 లక్షలు తీసుకున్నాడు. అంతే కాదు మహిళ పేరు మీద పలు క్రెడిట్ కార్డులను తీసుకుని వాడుకున్నాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి, వెళ్లిన మనోహరన్  ఎన్ని రోజులు అయిన  తిరిగి రాకపోవడంతో అతని సొంత గ్రామం చిత్తూరు జిల్లా కావేరి రాజపురానికి వెళ్లి బాధిత మహిళ విచారించింది. అయితే మనోహరన్ తల్లి చనిపోలేదని, అతనికి మరొక వివాహం జరిగినట్లు తెలుసుకుంది. దీంతో తాను మోసపోయానని గ్రహించి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడైన మనోహర్ తిరుపతి, గుంటూరు,  హైదరాబాద్ ఏరియాలో తిరుగుతున్నాడని గుర్తించారు. ప్రత్యేక బృందాలకు వచ్చిన సమాచారం మేరకు  హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న క్రమంలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వద్ద మనోహర్ ను  అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో నిందితుడైన గట్టమనేని మనోహర్  ఇతని స్వగ్రామం తమిళనాడు, ఇంటర్ వరకు చదువుకుని తరువాత చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడని పోలీసులు తెలిపారు.  జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వెబ్ సైట్ ద్వారా ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకుని తన మాటలతో ఏమార్చి  డబ్బులను తీసుకుని జల్సాలు చేస్తూ మోసాలకుపాల్పడుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.


 వెబ్ సైట్ ద్వారానే


 రాజముండ్రికి చెందిన మహిళను తన మాయమాటలతో ఏమార్చి పెళ్లి చేసుకుని ఆమె వద్ద నుంచి డబ్బులను బంగారపు వస్తువులను తీసుకుని మోసగించాడు. విశాఖపట్నంలో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తాను అని మోసం చేసి పారిపోయాడు. అదే విధంగా  హైదరాబాద్, చెన్నై, తిరుపతి లలో అమాయక ప్రజలను పలురకాలుగా మోసాలు చేస్తున్నాడు. అదే విధంగా విజయవాడకు చెంది వివరాలను వెబ్ సైట్ ద్వారా సేకరించి వారిని నమ్మించి పెళ్లి చేసుకుని వారి వద్ద డబ్బులను తీసుకుని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.