Uttarakhand Accident : ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్ జోషిమత్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు.  జోషిమత్ బ్లాక్‌లోని ఉర్గాం-పల్లా జఖోలా మోటార్‌ వే పై అదుపుతప్పిన ప్రైవేట్ వాహనం లోయపడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో 12 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురుకు తీవ్రగాయలయ్యాయి. మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా, పోలీసు సూపరింటెండెంట్ ప్రమేంద్ర దోవల్ ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. 






సీఎం పీఎస్ ధామి దిగ్భ్రాంతి 


ఉత్తరాఖండ్ చమోలీలోని డుమాక్ రోడ్డులోని పల్లా జఖోల్ గ్రామం వద్ద 16 మందితో వెళ్తోన్న వాహనం రోడ్డు పక్కనున్న లోయలో పడిపోయింది. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. చమోలీలో జరిగిన వాహన ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పీఎస్ ధామి సంతాపం తెలిపారు.  చమోలి డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం రెస్క్యూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.  






12 మంది మృతి 


ప్రమాదానికి గురైన బొలెరో మ్యాక్స్ వెహికల్ యూకే(076453) వాహనంలో 16 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఫ్  టీం రంగంలోకి చీకట్లో  రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇద్దరు మహిళలు సహా 12 మంది మృతదేహాలను సహాయక బృందం వెలికితీసింది. వాహనంలో ఇంకా ఎవరైనా ఉన్నారో అని సహాయ బృందాలు గాలింపు చేపట్టాయి. జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమేంద్ర దోవల్‌తో సహాయక బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనం నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన సమయంలో  భారీ శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. వాహనం కిమన గ్రామం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రహదారి మార్గంలో ప్రయాణించడం ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు.