Uttar Pradesh Serial Killer:
ముగ్గురిపై హత్యాచారం..
యూపీలోని బరబంకి ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. మహిళలనే టార్గెట్ చేస్తూ హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ అక్కడే తిరుగుతున్నాడని తెలిసి భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి ఆరు పోలీస్ బృందాలు కిల్లర్ కోసం గాలిస్తున్నాయి. సోషల్ మీడియాలో నిందితుడి ఫోటో షేర్ చేశారు. గుర్తించిన వారెవరైనా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు చెప్పారు. ఇప్పటికే ముగ్గురు మహిళలను దారుణంగా చంపేశాడు నిందితుడు. గతేడాది డిసెంబర్ 5న అయోధ్య జిల్లాలో ఖుషేటి గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ ఏదో పని మీద బయటకు వచ్చింది. సాయంత్రం మళ్లీ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు పెట్టారు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులకు...డిసెంబర్ 6న ఓ చోట ఆమె మృతదేహం కనిపించింది. శరీరంపై బట్టలు లేవని, ముఖంపై తీవ్రంగా గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. అయితే...ఆ మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది. ఆ తరవాత కొద్ది రోజులకే...బరబంకిలో మరో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఈమెను కూడా అత్యాచారం చేసిన చంపినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ వెల్లడించింది. డిసెంబర్ 30న తతర్హా గ్రామంలో 55 ఏళ్ల మహిళనూ ఇదే విధంగా హత్య చేశాడు సీరియల్ కిల్లర్. ఈ కేసుని విచారిస్తున్న పోలీస్ ఆఫీసర్‌ను తొలగించి...మరో అధికారిని నియమించారు. బరబంకి ఏరియాలో హై అలర్ట్ ప్రకటించారు.