ఉత్తర ప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో దారుణం జరిగింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ హరీష్ ద్వివేది కారు దూసుకెళ్లడంతో గాయపడ్డ 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం మంగళవారం నాడు  హర్దియా జంక్షన్ లో జరిగింది. బాలుడు చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారని పీటీఐ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. 


అసలేం జరిగిందంటే..
యూపీలోని బస్తీ జిల్లాలో హార్దియా కూడలి సమీపంలో అభిషేక్ అనే 9 ఏళ్ల బాలుడు శనివారం స్కూల్ నుంచి తన స్నేహితులతో ఇంటికి తిరిగి వస్తున్నాడు. బీజేపీ ఎంపీ హరీష్ ద్వివేదికి చెందిన 2 తెలుపు ఎస్ యూ వి కార్లు వెళుతుండగా ఓ వాహనం బాలుడు అభిషేక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలై రక్తం కారుతోంది. అయినా ఎంపీ కారు ఆ పిల్లాడిని అదే స్థితిలో వదిలేసి వెళ్లిపోయింది. ఆసుపత్రిలో చేర్చడానికి బదులుగా ఎంపీ ద్వివేది కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం. ఎంపీ నిర్లక్ష్యంపై బాలుడి తల్లిదండ్రులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఎంపీ కాన్వాయ్ ఢీకొనడంతో గాయపడ్డ బాలుడు అభిషేక్ ను స్థానికులు చికిత్స నిమిత్ం దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స అందించేందుకు లక్నోకు వెళ్లాలని డాక్టర్లు సూచించగా, తల్లిదండ్రులు బాలుడ్ని లక్నోకు తరలించారు. తీవ్ర గాయాలు కావడం, రక్తస్రావం జరగడంతో ట్రీట్మెంట్ అందించినా బాలుడి ప్రాణాలు దక్కలేదు. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడ్ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినట్లయితే తన కుమారుడు ప్రాణాలతో ఉండేవాడని అభిషేక్ తండ్రి శతృఘ్న రజ్బర్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ప్రమాదంపై ఎంపీ ద్వివేది వివరణ కోరేందుకు మీడియా ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. బిహార్ లో ఏదో సమావేశంలో పాల్గొనేందుకు ఎంపీ ద్వివేది వెళ్లారని ఆయన సిబ్బంది తెలిపినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది.


కేసు నమోదు చేసిన పోలీసులు 
బాధిత బాలుడు అభిషేక్ అనే బాలుడి తండ్రి శతృఘ్న రజ్బర్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సర్కిల్ ఆఫీసర్ (బస్తీ సదర్) అలోక్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రమాదానికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై ర్యాష్ డ్రైవింగ్ ఐపీసీ సెక్షన్ 279, నిర్లక్ష్యం కారణంగా ఒకరి మృతికి కారణం అని సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.


పశ్చిమ బెంగాల్ లోనూ ఇలాంటి ఘటనే..
నవంబర్ నెల మొదట్లో కూడా ఓ ఎంపీ కారు దూసుకుపోవడంతో ఆరేళ్ల బాలుడు మరణించిన ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది.  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముర్షిదాబాద్ ఎంపీ అబు తహీర్ ఖాన్ కు చెందిన కారు వల్ల ప్రమాదం జరిగి, బాలుడు చనిపోయాడని అని విచారణలో తేలింది.