Uppal CI attached to DCP office:  విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తెలంగాణ పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. పోలీస్ శాఖ ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ కిందిస్థాయి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తప్పు చేసిన అధికారులను ఎన్నిసార్లు హెచ్చరించినా తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తుండడంతో వారి పై బదిలీ వేటు వేసి సీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తున్నారు. తాజాగా ఉప్పల్ సీఐ‌పై తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు.  


ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు


ఉప్పల్ భగాయత్‌లో ప్రేమజంటను వేధించిన కేసులో నిందితుల పైన పెట్టి కేసు నమోదు చేసి వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎస్ఐ శంకర్ ను డీసీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు.  ఎస్ఐతో పాటు ఈ కేసులో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన  ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై కూడా బదిలీ వేటు వేసి సీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. అలాగే నాగోల్ ఇన్‌స్పె క్టర్ పరుశురాంపై కూడా బదిలీ వేటు పడింది. ఎస్ఐ మధు, ఐఎస్ఐ అంజయ్యనూ సస్పెండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయకుండా బాధితుడిని బెదిరించారని వారిపై ఆరోపణలు రావడంతో  ఇన్స్పెక్టర్ పై బదిలీ చేసినట్లు ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు.  


ఇదీ సంగతి
ఉప్పల్ భగాయత్​లో పోకిరీల ఆగడాలు రోజురోజుకు శృతి మించిపోతున్నాయి.  హెచ్ఎండీఏ లేఅవుట్‌లోకి వచ్చే జంటలను పోకిరీలు బెదిరిస్తున్నారు. వారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. తమను బెదిరించి రూ.3లక్షలు వసూలు చేశారని ఓ ప్రేమ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారికి న్యాయం చేయాల్సిన ఎస్ఐ శంకర్ పోకిరీలకు మద్దతుగా నిలిచారు. పోకిరీలతో చేతులు కలిపిన ఎస్ఐ, కంప్రమైజ్ కావాలని ఫిర్యాదుదారులకే సూచించాడు. దీంతో బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో విచారణ జరిపి..  ఈ నెల 19న ఐదుగురు నిందితులు అమర్, మారుతీ, ఉదయ్, రామ్ చరణ్​లను అరెస్ట్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన ఎస్ఐ శంకర్‌ను ఇప్పటికే డీసీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. ఇక తాజాగా ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ రాచకొండ సీపీ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు.