UP News: మొదటి భార్య బతికే ఉంది. భర్తతో గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు ఓ అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెనో రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ కాసేపటికే మొదటి భార్య అక్కడకు చేరుకోవడంతో.. సీనంతా రివర్స్ అయిపోయింది. పెళ్లి చేసుకున్న గంటకే రెండో భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆమె జీవితం నాశనం కాకూడదని పెద్దలు చెప్పడంతో తన సొంత తమ్ముడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ వింత ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. 


అసలేం జరిగిందంటే..?


ఉత్తర ప్రదేశ్ లోని సంభాల్ జిల్లా సైద్ నగరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే భార్యతో గొడవల కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడు మరో గ్రామానికి చెందిన ఓ యువతితోవివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి కూడా చేసుకోవాలని భావించాడు. ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పి అందరి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు. కానీ అదే సమయంలో మొదటి భార్య అక్కడకు చేరుకుంది. పెళ్లి మండపం వద్దనే గొడవకు దిగింది. తాను బతికుండగా రెండో పెళ్లి ఎలా చేసుకుంటావని ప్రశ్నించింది. దీంతో వరుడు భయపడిపోయాడు. అక్కడున్న పెద్దలు కూడా పోలీసులకు విషయం తెలిస్తే కేసు అవుతుందని భావించి.. సమస్యను అక్కడే సద్దుమణుగేలా చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టారు. అందులో తీసుకున్న నిర్ణయం మేరకు.. ఆ వ్యక్తి రెండో భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం ఆమె జీవితం పాడు కాకూడదనే ఉద్దేశ్యంతో తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి జరిపించారు. ఇలా ఈ కథ సుఖాంతమైంది. 


తమిళనాడులో దంపతుల వింత ఒప్పందం.. 


ఇటీవలే తమిళనాడులో ఓ పెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వివాహంలో పెళ్లి కూతురితో వరుడి స్నేహితులు ఓ ఒప్పందంపై సంతకం చేయించుకున్నారు. ఈ ఒప్పందం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంబట్టి మునిసిపల్ పరిధిలోని కిజాపుదూర్ ప్రాంతానికి చెందిన హరిప్రసాద్ ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ కూడా సూపర్‌గా ఆడతారట. తరచూ స్నేహితులతో కలసి హరిప్రసాద్ క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. అయితే హరిప్రసాద్‌కు తేనిలో నివాసం ఉండే పూజతో పెళ్లి ఫిక్సైంది.


ఉసిలంపట్టిలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో పెద్దలు వైభవంగా పెళ్లి జరిపించారు. అయితే వివాహ వేడుకల్లో వరుడి స్నేహితులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వధువు చేతిలో అగ్రిమెంట్ కాపీ పెట్టి అందులో సంతకం చేయాల్సిందేనని పట్టుబట్టారు. అయితే ఆ అగ్రిమెంట్ కాపీ చూసిన వధువు అవాక్కయింది. వరుడి స్నేహితులు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీని అందరికి చదివి వినిపించింది. పెళ్లి తర్వాత కూడా హరిప్రసాద్‌ను క్రికెట్ ఆడడానికి పంపించాలని ఆ అగ్రిమెంట్‌లో ఉంది. పెళ్లికూతురు అగ్రిమెంట్‌పై సంతకం చేసిన తర్వాత వారి పెళ్లి జరిపించారు. ఈ తతంగం చూసి పెళ్లికి వచ్చిన వారు అవాక్కయ్యారు. పెళ్లయ్యాక తన భర్త ఫ్రెండ్స్‌తో గడపకుండా, ఆటలాడకుండా భార్యలు అడ్డుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని, అందుకే ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్లు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ చెప్పారు.