Prisoner shot dead in Bihar hospital : జైల్లో ఉండేవాడు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. పోలీసులే చేర్పించారు. కానీ ఆ సమాచారం ఎవరు ఇచ్చారో కానీ.. ప్రత్యర్థులు ఐదు తుపాకులతో ఆస్పత్రిలోకి వచ్చి కాల్చి చంపేసి తమ దారిన తాము పోయారు. బీహార్ లో జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ గా మారింది.
బీహార్ రాజధాని పాట్నాలోని పారస్ హాస్పిటల్‌లో పేరోల్‌పై ఉన్న నేరస్తుడు చందన్ మిశ్రాను ఐదుగురు ఆయుధాలు ధరించిన వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన హాస్పిటల్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. చందన్ మిశ్రా బక్సర్ జిల్లాకు చెందిన నేర చరిత్ర గల వ్యక్తి. బెయూర్ జైలులో ఖైదీగా ఉన్నాడు . వైద్య కారణాలతో 15 రోజుల పేరోల్‌పై ఉన్నాడు. 2011లో వ్యాపారి రాజేంద్ర కేశ్రీ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి ఐదుగురు ఆయుధాలు ధరించిన వ్యక్తులు హాస్పిటల్‌లోని రూమ్ నంబర్ 209లోకి ప్రవేశించారు. చందన్ మిశ్రాపై కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వారు నిర్భయంగా కారిడార్‌లో నడుస్తూ, తుపాకులను బయటకు తీసి, 25 సెకన్లలో హత్య చేసి వెళ్లిపోయారు. చందన్ మిశ్రా వెంటనే చనిపోయారు. మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి.
కాల్పులు జరిపిన వ్యక్తుల ముఖాలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించడంతో తౌసిఫ్ అనే వ్యక్తిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురు నిందితులను గుర్తించారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) కార్తికేయ శర్మ ఈ హత్య వెనుక గ్యాంగ్ వార్ ఉందని గుర్తించారు. చందన్ షేరు గ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఒక ప్రత్యర్థి గ్యాంగ్ ఈ దాడి నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు.
హాస్పిటల్‌లో భద్రతా లోపాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దాడి చేసినవారు ఆయుధాలతో హాస్పిటల్‌లోకి ఎలా ప్రవేశించారని, భద్రతా సిబ్బంది లేదా పోలీసు గార్డుల పాత్రను కూడా విచారిస్తున్నారు. సర్కార్ రక్షణలో ఉన్న నేరస్తులు ఐసీయూలోకి ప్రవేశించి రోగిని కాల్చారు. బీహార్‌లో ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? 2005కి ముందు ఇలాంటివి జరిగాయా?” అని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసు ఉన్నతాధికారి కుందన్ కృష్ణన్, ఏప్రిల్, మే, మరియు జూన్ నెలల్లో వర్షాలు లేకపోవడం వల్ల రైతులకు పని లేక, నేరాల రేటు పెరుగుతోందని చెప్పుకొచ్చారు. దానిపై విమర్శలు వెల్లువెత్తాయి.